Naga Chaitanya: లోలోపల చాలా బాధగా ఉంటుంది.. నాగచైతన్య మనసులోని మాటలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:59 PM

యూట్యూబర్ జాస్తితో కలిసి రామగిరి ఫోర్ట్‌పై ట్రెక్కింగ్‌కు వెళ్లిన నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సాధారణంగా మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్ల రూపంలో తమ భావాలను బయటపెడుతుంటారు చాలామంది. అయితే తనకు ఎంత బాధ కలిగినా ఏడవాలని అనిపిస్తుందే తప్ప, కన్నీళ్లు మాత్రం రావని చెబుతున్నారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). అలా మనసులోని బాధను బయటకు వ్యక్తం చేయలేక లోలోపలే ఎంతో ఇబ్బందిపడుతుంటానని ఆయన వెల్లడించారు. తాజాగా ఓ అడ్వెంచర్ ట్రిప్‌లో భాగంగా యూట్యూబర్ జాస్తితో ముచ్చటించిన నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’ (Vrushakarma). ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను కూడా చిత్రబృందం ఆసక్తికరంగా ప్రారంభించింది.

ఇందులో భాగంగా నాగచైతన్య ఓ ప్రత్యేకమైన అడ్వెంచర్ ట్రిప్‌లో పాల్గొన్నారు. ప్రముఖ యూట్యూబర్ జాస్తితో కలిసి రామగిరి ఫోర్ట్‌పైకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దాదాపు ఒక రోజంతా అక్కడే గడుపుతూ ప్రకృతిని ఆస్వాదించారు. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, సరదా ముచ్చట్లు, జీవితానికి సంబంధించిన చర్చలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా జీవితాన్ని చూసే తన దృక్పథాన్ని కూడా నాగచైతన్య వివరించారు.

‘‘జీవితంలో ఎలాంటి పరిమితులు, సౌకర్యాలు ముందుగానే నిర్ణయించుకోకుండా.. మనకు ఎదురయ్యే పరిస్థితులను, లభించిన అనుభవాలను స్వీకరించడమే అసలైన జీవితం అన్నది నా అభిప్రాయం. కొన్ని సందర్భాల్లో బాధ కలిగినప్పుడు ఏడవాలని అనిపించినా కన్నీళ్లు రావు. కానీ లోలోపల చాలా బాధగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అడ్వెంచర్ ట్రిప్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య చెప్పిన మాటలు, ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. పూర్తి వీడియోను నవంబరు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ALSO READ:

‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ లేకుండానే.. నాని రియాక్షన్ ఇదే

సూర్య ‘సీన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

RC17: రామ్ చరణ్ సరసన ఆ ‘తార’ ఫిక్స్ అయినట్టేనా?

Updated Date - Nov 24 , 2026 | 05:38 PM