నాగచైతన్య 25వ సినిమాలో హీరోయిన్గా సాత్విక వీరవల్లి!
ABN, Publish Date - Nov 19 , 2026 | 03:49 PM
నాగచైతన్య 25వ చిత్రానికి ‘బెదురులంక’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వం వహించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అల్లు అరవింద్, బన్నీ వాసు, సుప్రియ యార్లగడ్డ నిర్మించనున్న ఈ మ్యూజికల్ లవ్‌స్టోరీలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
అక్కినేని నాగచైతన్య 'తండేల్' మూవీతో వంద కోట్ల క్లబ్లో తొలిసారి చేరాడు. ఆ సినిమా అందించిన విజయాన్ని ఆస్వాదిస్తూనే, తొందర పడకుండా మరో చక్కని విజయం కోసం వేచి చూశాడు. ఆ రకంగా అతనికి మిస్టికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'లో నటించే ఛాన్స్ లభించింది. ఈ సినిమా చాలాకాలంగా సెట్స్ మీదే ఉన్నా... దాని విడుదల కోసం నాగచైతన్య ఓపికగా ఎదురు చూస్తున్నాడు. 'విరూపాక్ష' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన కార్తీక్ దండు దీనికి దర్శకుడు కావడం, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్... సుకుమార్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండటంతో దీని విజయంపై నాగచైతన్య ధీమాగా ఉన్నాడు. అలానే దీనికి కథ, స్క్రీన్ ప్లే సైతం సుకుమారే ఇవ్వడం విశేషం. గతంలో నాగచైతన్య నటించిన 'హండ్రెడ్ పర్సంట్ లవ్' సినిమాకు సుకుమారే దర్శకుడు కూడా. ఇప్పుడీ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. దాంతో నాగచైతన్య నటించే తదుపరి చిత్రం ఏదనే చర్చ మొదలైంది.
ఇప్పటికే నాగచైతన్య హీరోగా ఇద్దరు ముగ్గురు దర్శకులు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు చెప్పిన కథలకు చైతూ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. కానీ నాగచైతన్య 25వ చిత్రానికి 'బెదురులంక' ఫేమ్ క్లాక్స్ దర్శకుడన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాను అల్లు అరవింద్‌తో కలిసి బన్నీవాసు, సుప్రియ యార్లగడ్డ నిర్మించబోతున్నారట. దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్.ఆర్.ఐ. భామ సాత్విక వీరవల్లి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందట. 'ఆకాశంలో ఒక తార' సినిమాకు అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి... సాత్వికకు రెండో అవకాశాన్ని సైతం ఆయనే ఇవ్వబోతున్నారు. నాగచైతన్యతో క్లాక్స్ తెరకెక్కించే ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీ అని, దీని షూటింగ్ జనవరిలో మొదలవుతుందని అంటున్నారు. మొత్తం మీద తొలి చిత్రం విడుదల కాకముందే సాత్విక వీరవల్లి ఖాతాలో రెండో సినిమా పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
అనిల్ రావిపూడి మొదలెట్టేశాడు.. ఇక జాతరే
సీఎం విజయ్‌కు థ్యాంక్స్ చెప్పిన ధనుష్.. విషయమిదే
‘వారణాసి’.. జక్కన్నా, ఈ వార్తలు నిజమేనా?