రూ. 3,500 కోట్లతో మైత్రీ సంచలనం
ABN, Publish Date - Nov 23 , 2026 | 03:18 PM
సినిమా కంపెనీలు సైతం పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్నాయి. ఓ నోటెడ్ తెలుగు ప్రొడక్షన్ హౌస్ కూడా 'ఐపీఓ'లో అడుగు పెట్టనుందట. ఇప్పటికే టాలీవుడ్ టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ మూవీస్ తెరకెక్కించిన ఈ సంస్థ 'పబ్లిక్ ఇష్యూ'కు వెళ్ళటానికి కారణం ఏమిటో!?
అనతి కాలంలోనే తెలుగు చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది 'మైత్రీ మూవీ మేకర్స్' సంస్థ. ఈ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఇద్దరూ దూకుడుగా చిత్రాలు నిర్మించేస్తున్నారు. మాతృభాష తెలుగులోనే కాదు తమిళ,కన్నడ, హిందీ భాషల్లోనూ మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాలు నిర్మించింది.ఇప్పటికీ అదే వేగంతో సాగుతోంది. ఈ సంస్థ నిర్మిస్తోన్న నాలుగు భారీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. జూనియర్ యన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీమేకర్స్ సంస్థ. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అలాగే 'జై హనుమాన్'ను భారీ స్థాయిలో రూపొందిస్తోంది... సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో భారీ సినిమాను పట్టాలెక్కించనుంది. ఇలా నాలుగు భారీ చిత్రాలను నిర్మిస్తోన్న మైత్రీ సంస్థ మళయాళ, హిందీ చిత్రసీమల్లోనూ హ్యూజ్ బడ్జెట్ మూవీస్ తెరకెక్కించే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ 'ఐపీఓ' అంటే 'ఇనిసియల్ పబ్లిక్ ఆఫరింగ్'కు వెళ్ళబోతోందట. మైత్రీ సంస్థ 3500 కోట్ల వాల్యూయేషన్ తో షేర్స్ ను అమ్మబోతోందనీ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి దాకా 'సెబీ'లో మైత్రీ సంస్థ ఏ లాంటి పత్రాలనూ దాఖలు చేయలేదు. ఏ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్ళినా సామాన్య షేర్ హోల్డర్స్ బాగోగులు చూసే 'సెబీ'లో నమోదు చేయించుకోవాలి.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 2015లో మహేశ్ బాబు 'శ్రీమంతుడు'తో చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టింది. తరువాత జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, రవితేజ వంటి స్టార్ హీరోస్ తో పాటు టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణతోనూ సినిమాలు నిర్మించి సినీఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నారు మైత్రీ అధినేతలు నవీన్, రవిశంకర్. ఇప్పటి దాకా తెలుగులో పద్మాలయా టెలీఫిలిమ్స్, పివిపి సంస్థలు మాత్రమే 'ఐపీఓ'కు వెళ్ళాయి. ఆ సంస్థలు సైతం కేవలం చిత్ర నిర్మాణంలోనే కాకుండా, ప్రదర్శన, పంపిణీవిభాగాల్లోనూ విస్తరించాయి. అయితే తర్వాత కాలంలో ఓ భారీ సంస్థలుగా అవి మార్పు చెందలేదు. అయితే మైత్రీ సంస్థ నగరశివార్లలో 260 ఎకరాల స్థలంలో ఓ ఫిలిమ్ స్టూడియోను నిర్మించే యోచనతో ఉంది. ఈ కోణంలోనే మైత్రీ సంస్థ 'పబ్లిక్ ఇష్యూ'కు పోతోందని టాక్. దీంతో మైత్రీ సంస్థ టాలీవుడ్ ను ఓ న్యూ కార్పోరేట్ శకంలోకి తీసుకువెళ్తోందని వినిపిస్తోంది.
గతంలో ఇలా పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళిన కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలు మన దేశంలో ఇతర రంగాలలో లేకపోలేదు. మణిరత్నం అన్న జి.వెంకటేశ్ తన 'జీవీ ఫిలిమ్స్'తో 'ఐపీఓ'లో అడుగు పెట్టారు. తరువాతి రోజుల్లో 'ఎరాస్ ఇంటర్నేషనల్ మీడియా', 'రాడాన్ మీడియా వర్క్స్' వంటి సంస్థలూ స్టాక్ ఎక్స్ చేంజెస్ లో తమ పేరు నమోదు చేయించుకున్నాయి. షో మేన్ సుభాష్ ఘై కూడా తన 'ముక్తా ఆర్ట్స్' తో పబ్లిక్ ఇష్యూకు వెళ్ళి 'తాళ్', 'పర్దేశ్' చిత్రాలు నిర్మించి ఘనవిజయం సాధించారు. ఈ యేడాది ఆగస్టులో 'సన్ షైన్ పిక్చర్స్' సంస్థ కూడా ఐపీఓలో అడుగు పెట్టింది. ఏక్తా కపూర్ 'బాలాజీ టెలీ ఫిలిమ్స్' 2000లోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్ళింది. ఆ సమయంలోనే 'ఉడ్తా పంజాబ్, ద డర్టీ పిక్చర్' వంటి చిత్రాలు నిర్మించి లాభాలు చూసింది. అయితే అందరూ ప్రతీసారి విజయాలు చూస్తారన్న గ్యారంటీ లేదు. అయినా మైత్రీ మూవీ మేకర్స్ భారీ మొత్తంతో పబ్లిక్ ఇష్యూకు వెళ్ళడం విశేషంగా మారింది. మరి ఈ సంస్థ 'సెబీ' జాబితాలో ఎప్పుడు చేరుతుందో? ఎప్పుడు పబ్లిక్ ఇష్యూకు వెళ్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?
‘నీతో ఓ అడుగు’.. ‘రాయవలస’ ప్రేమ గీతం అదిరింది
Megaverse: పవన్, ప్రభాస్, సూర్య.. లిస్ట్ చూస్తుంటే మతిపోతోందిగా