నా పని పూర్తయింది.. వారణాసి నుంచి 'కుంభ' అప్డేట్
ABN, Publish Date - Apr 08 , 2026 | 07:51 AM
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ షూటింగ్ పనులు చకచకా సాగుతున్నాయి.
మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi) షూటింగ్ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఇందులో ఆయన ‘కుంభ’ (Kumbha) అనే శక్తిమంతమైన విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగిసిన సందర్భంగా యూనిట్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఈ ప్రయాణం చాలా సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ‘ఈ షెడ్యూల్ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే పని పూర్తికాగానే ఆహార నియమాలను పక్కనపెట్టి, నచ్చిన ఫుడ్ తీసుకున్నాను’ అని తెలిపారు.
సరిగ్గా ఏడాదికి
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ చిత్రబృందం మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘ఒక వేళ మనం కాలయానం చేస్తూ, ఒక ఏడాది ముందుకు వెళితే ఈ సమయానికి మనం ‘వారణాసి’ చిత్రాన్ని చూస్తుంటాం. ఇట్స్ షో టైమ్’ అని పేర్కొంది. సంగీత దర్శకుడు కీరవాణి ఎక్స్‌లో ‘365’ అని పోస్ట్ పెట్టారు.
దీనికి స్పందనగా రాజమౌళి తనయుడు ఎస్. ఎస్. కార్తికేయ ‘పాటను ఎప్పుడు విడుదల చేస్తారు?’ అని ప్రశ్నించగా ‘సెట్ వేస్తున్నారంటగా... దర్శకుడు హ్యాపీయా’ అంటూ మహేశ్‌బాబు ‘పోకిరి’ స్టైల్లో యూనిట్ సమాధానం ఇచ్చింది. దీంతో త్వరలోనే ‘వారణాసి’ తొలి పాటకు సంబంధించిన అప్డేట్ రావొచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయిక. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.