మోక్షజ్ఞ తొలి సినిమాలో శ్రీలీల!?
ABN , Publish Date - Sep 10 , 2026 | 02:43 PM
నందమూరి బాలకృష్ణ నటవారసునిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని తెలిసిన దగ్గర నుంచీ పలు కహానీలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో వాస్తవమెంతో కానీ ఫ్యాన్స్ మాత్రం అవి వింటూ సంబరపడి పోతున్నారు. కొందరు డౌట్ పడుతున్నారు.
బాలకృష్ణ నటవారసుడుగా మోక్షజ్ఞ తారకరామతేజను తెరపై చూడాలని అభిమానులు కొన్నేళ్ళ నుంచీ ఎదురుచూస్తున్నారు. వారి అభిలాష ఈ యేడాది ఆరంభంలో నెరవేరుతుందని భావించారు. అప్పట్లో 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ తన 'బింబిసార'తో దర్శకునిగా పరిచయం చేసిన వశిష్ఠ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అని ప్రకటించారు. చిరంజీవి హీరోగా 'విశ్వంభర' చిత్రాన్ని తెరకెక్కించారు వశిష్ఠ. ఆ సినిమా విడుదల కావలసి ఉంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య తనయుడు మోక్షు హీరోగా వశిష్ఠ డైరెక్షన్ లో సినిమా అని ప్రకటన వెలువడడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో మోక్షజ్ఞ సరసన శ్రీలీల నాయికగా నటిస్తోందని వినికిడి. బాలయ్యతో శ్రీలీల నటించిన 'భగవంత్ కేసరి' ఘనవిజయం సాధించింది. అందువల్ల మోక్షుతో శ్రీలీల జోడీ కూడా ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
మోక్షజ్ఞ సరసన శ్రీలీల నటిస్తుందన్న విషయంపై ఇప్పటి దాకా ఏ క్లారిటీ లేదు. దర్శకుడు వశిష్ఠ కానీ, ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు కానీ హీరోయిన్ ఎవరో ప్రకటించలేదు. అయితే మోక్షు జోడీగా శ్రీలీల నటిస్తే బాగుంటుందని కొందరు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తండ్రి బాలకృష్ణతో శ్రీలీల కూతురులాంటి పాత్రలో నటించిన భగవంత్ కేసరి' ఘనవిజయం సాధించింది. ఆ కోణంలో చూస్తే బాలయ్య నటవారసుడు మోక్షుకు కూడా శ్రీలీల పాదం అచ్చివస్తుందని అభిమానుల అభిప్రాయం.ఇదిలా ఉంటే తెలుగు చిత్రాల్లో శ్రీలీల ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. 'భగవంత్ కేసరి'తో పాటు రవితేజతో నటించిన 'ధమాకా', అల్లు అర్జున్ సరసన చిందేసిన 'పుష్ప-2' చిత్రాలు మాత్రమే బంపర్ హిట్స్ సాధించాయి. మిగిలినవన్నీ ఏ మాత్రం మురిపించలేక పోయాయి. అందువల్ల కొందరు శ్రీలీల లెగ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హీరోలుగా తెరంగేట్రం చేసిన కొత్తవారితో శ్రీలీల నటించింది. ఆ రెండూ కన్నడ చిత్రాలే కావడం గమనార్హం. శ్రీలీల తొలిసారి నాయికగా కనిపించిన చిత్రం 'కిస్' - ఆ సినిమా హీరో విరాట్ కు కూడా అదే మొదటి చిత్రం. శతదినోత్సవం చూసింది. తరువాత కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన 'జూనియర్'లోనూ శ్రీలీలనే నాయిక. ఈ సినిమా ఆకట్టుకోలేక పోయింది. అందువల్ల మోక్షు జోడీగా శ్రీలీల నటిస్తే అంతగా రక్తి కట్టదు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి సీనియర్స్ తో చిందేసిన శ్రీలీల మోక్షు జోడీగా కనిపించినా మురిపించలేదనీ కొందరు చెబుతున్నారు. ఇలా మోక్షు తొలి సినిమాలో శ్రీలీల నటిస్తే బాగుంటుందని కొందరు, అంతగా ఒప్పదని మరికొందరు భావిస్తున్నారు. నవంబర్ లో మొదలు కానున్న మోక్షజ్ఞ సినిమాలో ఎవరు హీరోయిన్ గా ఎన్నికవుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘రాకా’లో విల్ స్మిత్ ఊరమాస్ అవతార్.. లీక్డ్ పిక్ వైరల్
జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్
200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ