సుమలత పిటిషన్‌తో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..

ABN , Publish Date - Oct 09 , 2026 | 11:50 AM

తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 11న నిర్వహించ తలపెట్టిన ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది.

Sumalatha Devi

తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 11న నిర్వహించ తలపెట్టిన ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. ఎన్నికలకు ముందే వివాదాన్ని విచారించకుండా, ఎన్నికల అనంతరం విచారణకు తేదీ నిర్ణయించడంపై ట్రయల్ కోర్టు తీరును తప్పుబట్టింది. పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తూ సెప్టెంబర్ 28న జారీ చేసిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసింది.

01.jpg


అసలేం జరిగిందంటే..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెప్టెంబర్ 23న తమ అసోసియేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి (జానీ మాస్టర్ వైఫ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సెప్టెంబర్ 24న ఫెడరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, 2026–2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వారం ముందే ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఉండటంతో గత ఆదివారం జరగాల్సిన ఈ ఎన్నికలను అక్టోబర్ 11కు వాయిదా వేశారు. అయితే, ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం డిసెంబర్ 6, 2027 వరకు ఉందని, ఈ నేపథ్యంలో ఫెడరేషన్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ సుమలతా దేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసోసియేషన్ కార్యవర్గాన్ని కొనసాగించడంతో పాటు, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ సివిల్ దావా దాఖలు చేశారు. పిటిషనర్ సెప్టెంబర్ 28న దావాతో పాటు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు. అయితే, ట్రయల్ కోర్టు అత్యవసర నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నవంబర్ 3, 2026కి నిర్ణయించింది. కానీ, అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 8న విచారణ చేపట్టిన జస్టిస్ ఎం.బి. లక్ష్మి ధర్మాసనం, ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో మధ్యంతర ఉపశమనం నిరాకరించడానికి గల కారణాలు స్పష్టంగా లేవని పేర్కొంది.

02.jpg

ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 24నే జారీ అయిందని, అక్టోబర్ 11న ఎన్నికలు జరగనున్నాయని తెలిసినప్పటికీ, విచారణను నవంబర్ 3కి వాయిదా వేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఎన్నికలకు ముందే కేసును విచారించేలా అక్టోబర్ 11లోపు విచారణ తేదీని నిర్ణయించడం కనీసం ట్రయల్ కోర్టు చేయాల్సిన పని అని స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసును విచారిస్తే, పిటిషనర్ కోరుతున్న న్యాయపరమైన పరిష్కారం నిరర్థకమయ్యే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో కేసును నవంబర్ 3కి వాయిదా వేయడానికి సరైన ఆధారం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో ట్రయల్ కోర్టు సెప్టెంబర్ 28న జారీ చేసిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయడానికి తగిన కారణాలున్నాయని హైకోర్టు భావించింది. ఎన్నికలు అక్టోబర్ 11న జరగాల్సి ఉండటంతో పిటిషనర్‌కు తక్షణ మధ్యంతర రక్షణ అవసరమని పేర్కొంది. దీంతో ఫెడరేషన్ తరఫున ప్రతివాది కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. ప్రతివాదికి వ్యక్తిగత నోటీసుతో సహా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

03.jpg


అక్టోబర్ 30కి తదుపరి విచారణ

దసరా సెలవుల అనంతరం కోర్టు పునఃప్రారంభమయ్యే అక్టోబర్ 30న ఈ కేసును విచారణకు జాబితా చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో ఫెడరేషన్ తన వాదనలు వినిపించాల్సి ఉంటుంది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అసోసియేషన్ రద్దు నిర్ణయం, ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం, ఎన్నికల నోటిఫికేషన్ చెల్లుబాటుపై తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఫెడరేషన్‌కు ఊహించని పరిణామమనే చెప్పుకోవాలి. చూద్దాం మరి.. ఫెడరేషన్ ఎలా మూవ్ అవుతుందో?

04.jpg

ఇవి కూడా చదవండి:

Scene Movie: సూర్య, నజ్రియా.. ‘అమ్మో ఇది ఎవర్రా’

కోలీవుడ్‌కు మరో టాలీవుడ్ హీరోయిన్ జంప్

కిలికిని మించి.. ‘వారణాసి’ కోసం జక్కన్న ‘బాహుబలి’ స్ట్రాటజీ!

Updated Date - Oct 09 , 2026 | 11:50 AM