Meenakshi Chaudhary: మీనాక్షికి మరో ఆఫర్... ఎవరితో అంటే..
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:30 PM
ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో విజయాన్ని అందుకున్నారు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). ప్రస్తుతం ఆమె రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ (Nithiin)
హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో కథానాయికగా మీనాక్షి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మీనాక్షి నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తమిళ హీరో కార్తి సరసన కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఒకవైపు తెలుగు, మరోవైపు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న మీనాక్షి.. ఇప్పుడు మరో తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ‘సామజవరగమన’, ' నారీ నారీ నడుమ మురారి' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు.. నితిన్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాక్. ఇందులో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం మీనాక్షి చౌదరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారట. రామ్ అబ్బరాజు గతంలో వినోదాత్మక కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు నితిన్ కోసం కూడా అలాంటి ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేస్తున్నారట. నితిన్ కామెడీ టైమింగ్ బావుంటుంది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలతో బిజీ గా ఉన్నారు. అందులో ఒకటి నాని నిర్మిస్తున్న 'అలియాస్ రుక్మిణి', మరొకటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న చిత్రంలో బిజీగా ఉన్నారు. అలాగే, తన సొంత ప్రొడక్షన్ సంస్థ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్‌పై కూడా ఓ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'ఆయ్' ఫేమ్ అంజి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాదే ఈ మూవీ మొదలుకానుంది.