Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!
ABN, Publish Date - Jun 01 , 2026 | 11:08 AM
మే మాసంలో సగటున రోజుకు ఒకటి చొప్పున 31 చిత్రాలు విడుదలయ్యాయి. అయితే అందులోగ్రాండ్ విక్టరీని అందుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు!
మేలో ఎండలు మండిపోయాయి... అయినా ఏసీ ధియేటర్లకు రావడానికి ప్రేక్షకులు జంకారు. థియేటర్లలో సినిమాలను భరించడం కంటే... ఎండ వేడిని తట్టుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. చిత్రం ఏమంటే... ఈ యేడాది అత్యధిక చిత్రాలు విడుదలైంది మే నెలలోనే! ఈసారి మే నెలలో ఐదు వీకెండ్స్ వచ్చాయి. దాంతో ఏకంగా 31 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 21 కాగా, డబ్బింగ్ సినిమాలు 10. కానీ ఈ సినిమాల్లో తెలుగులో బ్రేకీవెన్ అయిన చిత్రాలు ఒకటి రెండు మాత్రమే!
మే నెల ప్రారంభమే నీరసంగా మొదలైంది. మే 1న తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' (Gayapadda Simham), సత్య 'జెట్లీ' (Jetlee) మూవీస్ వచ్చాయి. ప్రీ రిలీజ్ సమయంలో ఈ సినిమాలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఖచ్చితం ఈ సినిమాలు గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంటాయని అంతా భావించారు. కానీ వారి ఆశలను ఈ వినోదాత్మక చిత్రాలు నిరాశకు గురిచేశాయి.
సెకండ్ వీకెండ్‌లో సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్' వంటి సినిమాలు విడుదలయ్యాయి. పేరుకు ఇవి చిన్న సినిమాలే అయినా ప్రచారం మాత్రం పెద్ద సినిమాల తరహాలో సాగింది. అదే ఈ సినిమాలకు మైనెస్ అయ్యింది. కొద్దిపాటి అంచనాలతో ఈ సినిమాలను చూడటానికి వెళ్ళిన వాళ్ళు సైతం ముఖాలు వేలాడేసుకుని థియేటర్ల నుంచి బయటకు వచ్చారు.
మూడో వారాంతంలో సూర్య 'వీరభద్రుడు' (Veerabhadrudu) , కన్నడ అనువాద చిత్రాలు 'కేడీ, రాక్షసపురం' వంటివి వచ్చాయి. అలానే వెంకట్ 'హరుడు' (Harudu), 'దూరదర్శిని' వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవేవీ కూడా బాక్సాఫీస్ బరిలో తమ సత్తాను చాటలేకపోయాయి. అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న 'వీరభద్రుడు' తెలుగులో ఫర్వాలేదనిపించినా, తమిళంలో మాత్రం గ్రాండ్ విక్టరీని కైవసం చేసుకుంది.
నాలుగో వారాంతంలో మలయాళ అనువాద చిత్రం 'దృశ్యం 3' (Drushyam 3)తో పాటు 'పురుషః, రమణి కళ్యాణం, ఫస్ట్ టైమ్, అగ్లీ స్టోరీ' వంటి చిత్రాలు వచ్చాయి. తెలుగులో 'దృశ్యం 3'ని చూసిన వారు మొదటి రెండు చిత్రాల స్థాయిలో లేదని పెదవి విరిచారు. కానీ మలయాళంలో మాత్రం ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మోహన్ లాల్, మీనా జంటకు మరోసారి మలయాళీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఐదో వారాంతంలో ఏకంగా ఏడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో రెండు అనువాద చిత్రాలు 'కాటాలన్, బ్లాస్ట్ జోన్' (Blast Zone) కాగా మిగిలినవి స్ట్రయిట్ తెలుగు సినిమాలు. ఇందులో 'కాటాలన్' అల్లు అర్జున్ ' పుష్ప'నే తలపింప చేయగా, 'బ్లాస్ట్ జోన్' టేకింగ్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమా టాక్ కు తగ్గ కలెక్షన్స్ ను మాత్రం వసూలు చేయలేకపోతోంది.
ఈ నెలలో 'గంగ, కృష్ణ, ఆంధ్రావాలా, ఊసరవెల్లి, అతిథి, వన్ : నేనొక్కడినే' వంటి సినిమాలు సైతం రీ-రిలీజ్ అయ్యాయి. బాధాకరం ఏమంటే... సగటున రోజుకు ఒకటి చొప్పున మే లో 31 సినిమాలు విడుదలైనా... గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది ఏదీ లేదు!
ఇవి కూడా చదవండి:
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!
Nbk: బాలయ్య స్పీడ్ మాములుగా లేదుగా.. మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా?