సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలకృష్ణ విషయంలో మణిశర్మను తమన్ క్రాస్ చేస్తాడా!?

ABN, Publish Date - Sep 29 , 2026 | 10:02 AM

గడిచిన రెండున్నర దశాబ్దాల కాలంలో నందమూరి బాలకృష్ణతో వరుసగా ఆరు సినిమాలకు సంగీతం సమకూర్చిన ఘనత అటు మణిశర్మకు, ఇటు ఆయన శిష్యుడు తమన్ కు దక్కింది.

Balakrishna - Mani Sharma - Thaman

గాడ్‌ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు ఎవరైనా నచ్చారంటే... మరో ఆలోచన లేకుండా వాళ్ళను ఎంకరేజ్‌ చేస్తూనే ఉంటారు. గడిచిన రెండున్నర దశాబ్దాలలో అలా బాలకృష్ణ అభిమానించి, వరుసగా అవకాశాలిచ్చిన ఇద్దరు సంగీత దర్శకులు రేర్‌ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. వారిద్దరూ గురుశిష్యులైన మణిశర్మ (Mani Sharma), తమన్ (Thaman) కావడం విశేషం.

మెలోడీ బ్రహ్మ మణిశర్మకు బాలకృష్ణతో ప్రత్యేక అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం 'సమరసింహారెడ్డి' ఈ సినిమా 1999లో సంక్రాంతి కానుకగా విడుదలైంది. బాలకృష్ణ కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టించి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దాంతో బాలకృష్ణ చిత్రానికి మణిశర్మ తన మ్యూజిక్‌ తో భలే మ్యాజిక్‌ చేశాడని అంతా అనుకున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రావడానికి రెండేళ్ళు పట్టింది. అదే 2001లో వచ్చిన 'నరసింహ నాయుడు'. విశేషం ఏమంటే... ఆ తర్వాత వరుసగా బాలకృష్ణ ఐదు సినిమాలకు మణిశర్మ సంగీతాన్ని ఇచ్చారు. అవి 'భలేవాడివి బాసు, సీమ సింహం, చెన్నకేశవ రెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు, లక్ష్మీ నరసింహ' చిత్రాలు. ఇందులో 'నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా' చిత్రాలు సూపర్ డూపర్ హిట్‌ అయ్యాయి. 'చెన్నకేశవరెడ్డి' సైతం మంచి విజయాన్నే అందుకుంది. అయితే మిగిలిన మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా బాలకృష్ణ ఆ జయాపజయాలను దృష్టిలో పెట్టుకోకుండా వరుసగా ఆరు సినిమాలకు సంగీతం సమకూర్చే బాధ్యతను మణిశర్మకు ఇచ్చారు.


మణిశర్మ శిష్యుడు తమన్ సైతం తెలుగు సినిమా రంగంలో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాలకృష్ణ చిత్రానికి సంగీతం అందించే అవకాశం తమన్ కు కాస్తంత ఆలస్యంగానే వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా 'డిక్టేటర్'. ఇది 2016 సంక్రాంతికి విడుదలైంది. బాలకృష్ణ - మణిశర్మ కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'సమరసింహారెడ్డి' కూడా పొంగల్‌ కే రిలీజ్‌ కావడం విశేషం. అయితే 'సమరసింహారెడ్డి' స్థాయి విజయాన్ని 'డిక్టేటర్' అందుకోలేదు. అయినా బాలకృష్ణ దానిని దృష్టిలో పెట్టుకోకుండా తమన్ కు అవకాశాలు ఇచ్చారు. అలా వారి నాన్ స్టాప్ కాంబో 'అఖండ'తో శ్రీకారం చుట్టుకుంది. 'అఖండ' సినిమా తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్‌, అఖండ 2' చిత్రాలకు తమన్ వరుసగా స్వరాలు సమకూర్చారు. ఇందులో ఒక్క 'అఖండ 2' మాత్రమే ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. బాలకృష్ణ - మణిశర్మ కాంబినేషన్ తో పోల్చితే... వరుసగా సంగీతం అందించిన చిత్రాలలో బాలకృష్ణ - తమన్ కాంబోలో వచ్చిన చిత్రాలే ఎక్కువ విజయవంతం అయ్యాయి.


ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న 'దాదా' సినిమా సెట్స్ మీద ఉంది. డిసెంబర్ 24న విడుదల కాబోతున్న ఈ సినిమాకు కూడా తమనే సంగీతం అందిస్తున్నారు. ఇది వీరిద్దరి కాంబోలో వరుసగా వస్తున్న ఆరో సినిమా ఇది. అంటే మణిశర్మ రికార్డ్ ను ఆయన శిష్యుడు తమన్ సమం చేశాడు. ఒకవేళ బాలకృష్ణ నెక్ట్స్ మూవీకి కూడా తమనే సంగీతం అందిస్తే... మణిశర్మ రికార్డ్ ను క్రాస్ చేసినట్టు అవుతుంది. బాలకృష్ణ -తమన్ కు మంచిగా సింక్ అయ్యిందని సినీజనాలు భావిస్తున్నారు. అందుకనే సరదాగా అతన్ని 'నందమూరి తమన్' అని పిలుస్తుంటారు. బాలకృష్ణ మనసెరిగి మెసులుకునే తమన్... మణిశర్మ రికార్డ్ ను క్రాస్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. మరి ఏమౌతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

16 ఏళ్లకే ఇల్లు వదిలి వచ్చేసిన అక్కినేని కోడలు..

నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి అన్‌ఫిల్టర్డ్ స్టోరీస్..

Devara 2: ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్? కథలో మార్పులకు ఓకే చెప్పిన తారక్?

Updated Date - Sep 29 , 2026 | 10:04 AM