16 ఏళ్లకే ఇల్లు వదిలి వచ్చేసిన అక్కినేని కోడలు..
ABN , Publish Date - Sep 28 , 2026 | 08:31 PM
అక్కినేని పెద్ద కోడలు శోభిత ధూళిపాళ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తెనాలి అమ్మాయి అయినా కూడా తెలుగులో అమ్మడు చేసినవి చాలా తక్కువ సినిమాలు.
అక్కినేని పెద్ద కోడలు శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తెనాలి అమ్మాయి అయినా కూడా తెలుగులో అమ్మడు చేసినవి చాలా తక్కువ సినిమాలు. బాలీవుడ్ లో తన సత్తా చాటిన శోభిత.. నాగ చైతన్యతో డేటింగ్ చేస్తుంది అనే వార్త వచ్చాకనే తెలుగువారికి సుపరిచితమయ్యింది. ఆ తరువాత ఈ జంట ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్ళి శోభిత.. అక్కినేని ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ చిన్నది తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మోడలింగ్, సినిమాలపై ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే తన కలలను నెరవేర్చుకోవడానికి ఇల్లు వదిలి బయటకు వచ్చినట్లు తెలిపి షాక్ ఇచ్చింది.
'నాకు కేవలం 16 ఏళ్ల వయసున్నప్పుడే వైజాగ్ నుంచి బ్యాగ్ సర్దుకుని కోనార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేశాను. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొందాం అనుకుని అడుగు ముందుకు వేశాను. అలా సొంత ఊరిని వదిలి వచ్చిన నా ప్రయాణం ఈ రోజు నటిగా ఈ స్థాయికి తీసుకువచ్చిందని' ఆమె తెలిపింది. తనకు నచ్చిన మార్గంలో వెళ్లేందుకు, నటిగా మారేందుకు తన తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని శోభిత చెప్పింది. ఇంట్లో ఇచ్చిన ఆ ధైర్యమే తనను నిలబెట్టిందని, ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనదని, ప్రతీ ఒక్కరికీ వేర్వేరు గమ్యస్థానాలు ఉంటాయని ఆమె అభిప్రాయపడింది.
ఇక విజయం అనే దానికి తనదైన శైలిలో నిర్వచనం చెప్పుకొచ్చింది. సినిమాల్లో విజయం సాధించడం అంటే తప్పనిసరిగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడం లేదా 1000 కోట్ల కలెక్షన్లు సాధించే సినిమాల్లో భాగం కావడం మాత్రమే కాదని, నటిగా తనకు సంతృప్తినిచ్చే పాత్రలు చేయడం, ఎంచుకున్న మార్గంలో నిజాయితీగా ముందడుగు వేయడమే అసలైన విజయమని పేర్కొంది. ప్రస్తుతం శోభిత కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.