బన్నీ, చెర్రీలను వదిలి ప్రిన్స్ వెంట లోకేష్ కనగరాజ్!
ABN, Publish Date - Oct 06 , 2026 | 08:26 AM
అల్లు అర్జున్, రామ్‌చరణ్ ప్రాజెక్టులు సెట్ కాకపోవడంతో లోకేష్ కనగరాజ్ ఇప్పుడు మహేశ్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబోను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అనుకున్నంతా అయ్యింది! గత కొంతకాలంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దానిని ఆ చిత్రంలోని కొందరు సాంకేతిక నిపుణులు ఖండించారు. అల్లు అర్జున్ 'రాకా' షూటింగ్ పూర్తి చేయగానే ఇదే సినిమా మొదలవుతుందని తెలిపారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. కారణాలు ఇంకా బయటకు రాలేదు కానీ అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ మూవీ ఇప్పట్లో ఉండదని స్పష్టం అయిపోయింది.
లోకేష్ కనగరాజ్ 'విక్రమ్' మూవీ తీయకముందు నుంచే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో టచ్‌లో ఉన్నాడు. చెర్రీకి కొన్ని కథలు కూడా చెప్పాడు. దానితో కొన్ని ఆసక్తికరంగా ఉండటంతో రామ్ చరణ్... లోకేష్ తో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడని తెలిసింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది? ఎవరు నిర్మిస్తారు? అనే వాటిలో మాత్రం క్లారిటీ రాలేదు. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... ఇప్పట్లో రామ్ చరణ్ సైతం లోకేష్ కనగరాజ్‌తో మూవీ చేసే ఆలోచనలో లేడట. దాంతో ఇప్పుడు బన్నీ, చెర్రీల నుంచి లోకేష్ కనగరాజ్ ప్రిన్స్ మహేశ్ బాబు వైపు దృష్టి మళ్ళించినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసిందట. ఆ బ్యానర్‌లో మహేశ్ బాబు -లోకేష్ కనగరాజ్ కాంబోలో మూవీ తెరకెక్కబోతోందని అంటున్నారు. మొత్తం మీద ఇటీవల 'డీసీ' మూవీతో హీరోగానూ పరిచయం అయిన లోకేశ్ కనకగరాజ్... 'వారాణాసి' లాంటి మూవీ తర్వాత మహేశ్ బాబు తో సినిమా చేయడం అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ రేర్ కాంబినేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏ సంచలనాలకు శ్రీకారం చుడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 'రాకా' ప్రాజెక్ట్ మీదే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన అల్లు అర్జున్ తో దానికి సీక్వెల్ ను కూడా తీసేందుకు సన్ పిక్చర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇక 'అఖండ 2'తో కాస్తంత డౌన్ అయిన బోయపాటి శ్రీనును మళ్ళీ లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చే పనిని అల్లు అరవింద్ భుజానికెత్తుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్‌తో బోయపాటి దర్శకత్వంలో అరవింద్ ఓ మూవీ ప్లాన్ చేశారు. కానీ అప్పట్లో అది పట్టాలెక్కలేదు. ఆ సినిమాను ఇప్పుడు నిర్మించాలని అల్లు అరవింద్ భావిస్తున్నారట. దాంతో బోయపాటి సినిమా, రాకా సీక్వెల్‌తో అల్లు అర్జున్ ఫుల్ బిజీగా మారిపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
‘డ్రాగన్’ భారీ షెడ్యూల్.. ఎన్టీఆర్ రీఎంట్రీ అక్కడేనా?
నెట్‌ఫ్లిక్స్‌లో అన్న - అమెజాన్‌లో తమ్ముడు.. దుమ్మురేపుతున్నారు
డీప్‌ఫేక్‌లు, ఆన్‌లైన్ వేధింపులపై విష్ణు మంచు కీలక నిర్ణయం