Madhav: గ్రామీణ నేపథ్యంలో 'మారెమ్మ'... టీజర్ అదిరిందిగా...
ABN, Publish Date - Feb 05 , 2026 | 09:28 AM
రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటించిన సినిమా 'మారెమ్మ'. ఈ సినిమా టీజర్ ను ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
రవితేజ (Ravi Teja) సోదరుడు రఘు కుమారుడు మాధవ్ (Madhav) హీరోగా నటిస్తున్న సినిమా 'మారెమ్మ' (Maremma). ఈ సినిమాతో హీరోగా మాధవ్, దర్శకుడిగా మంచాల నాగరాజు, హీరోయిన్ గా దీపా బాలు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను దర్శకుడు బాబీ కొల్లి ఆవిష్కరించారు.
ఈ టీజర్ ను గమిస్తే, ఒక అంటువ్యాధి గ్రామాన్ని చుట్టుముట్టి, ప్రజలు, పశువుల ప్రాణాలను బలిగొంటుంది. గ్రామస్తులు తమ గ్రామ దేవత మారెమ్మ తల్లిని ప్రార్ధిస్తారు. ఆ దేవతకు సంబంధించిన పవిత్ర ఎద్దును కాపాడే బాధ్యత హీరోది. అయితే ఒక రోజు ఆ ఎద్దు అనూహ్యంగా అదృశ్యమవుతుంది. ఇక్కడినుంచే కథ కీలక మలుపులు తిరుగుతుంది. ఇది మాధవ్‌కు తొలి చిత్రమైనప్పటికీ, అతను ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉండే కథను ఎంచుకున్నాడనిపిస్తుంది. పూర్తిగా రూరల్ లుక్‌లో కనిపించిన మాధవ్, తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్నాడు. అతనికి జోడీగా దీపా బాలు నటించగా, గ్రామ పెద్ద పాత్రలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ బలమైన ముద్ర వేశారు. సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి పవర్ ఫుల్ నేపథ్య సంగీతంతో ఉత్కంఠను పెంచారు. మొత్తం మీద, ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్ కు అతిధిగా విచ్చేసిన డైరెక్టర్ బాబి కొల్లి (Bobby Kolli) మాట్లాడుతూ, 'రవితేజ గారితో జర్నీ చేస్తున్నప్పుడు మాధవ్ ని చూస్తూ ఉండేవాణ్ణి. రవితేజ గారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. అలాగే మాధవ్ కూడా తన కాళ్ళ మీద తనే నిలబడాలని ఆయన కోరుకుంటున్నారు. టీజర్ చూస్తుంటే చాలా మంచి పాయింట్ చుట్టూ నడిపారని అనిపిస్తుంది. సినిమా బాగుంటే కచ్చితంగా రవితేజ గారి ఫాన్స్, ఆడియన్స్ అందరు కూడా చూస్తారు. ఈ టీజర్ లో నాకు మ్యూజిక్ చాలా నచ్చింది. టీజర్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంత ఎక్సైటింగ్ గా ఉంటుందని నమ్ముతున్నాను' అని అన్నారు.
హీరో మాధవ్ మాట్లాడుతూ, 'లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి షూటింగ్ మొదలుపెట్టాం. ఇప్పుడు టీజర్ తో మీ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. నాగరాజు గారు టీజర్ ని అద్భుతంగా చూపించారు. ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. నిర్మాతలకు థాంక్యు సో మచ్. విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. విహారి మ్యూజిక్ ఇరగదీసాడు. టీమ్ అందరికీ థాంక్యూ సో మచ్' అని అన్నారు. హీరోయిన్ దీపా మాట్లాడుతూ, 'ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ, 'ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ తో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇందులో చూపించిన మైసాపురం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి కథ, పాత్రలు మా ఊర్లో కూడా జరిగింది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు వికాస్ వశిష్ఠ, సహ నిర్మాత కుశాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నటుడు రఘు కుమారుడు హీరోగా నటించడం ఇదే మొదటిసారి కాదు. అతను గతంలోనూ ఒకటి రెండు సినిమాలలో హీరోగా నటించాడు. అయితే ఆ ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోయాయి. ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి గతంలో మాధవ్ ను హీరోగా పరిచయం చేస్తూ 'ఏయ్ పిల్లా' మూవీని తీశారు. రమేశ్ వర్మ కథను అందించిన ఈ సినిమాను లూధీర్ బైరెడ్డి డైరెక్ట్ చేశారు. మిక్కీ జే మేయర్ దానికి సంగీతం అందించారు. కానీ ఆ సినిమా ఏ కారణంగానో జనం ముందుకు రాలేదు. ఆ సినిమాలో మిస్ ఇండియా రన్నరప్ రూబెల్ షెఖావత్ హీరోయిన్ గా నటించింది.