Laya: ఒకే రోజు లయ నటించిన రెండు చిత్రాలు!
ABN , Publish Date - Jul 09 , 2026 | 10:53 AM
లయ నటించిన 'వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్రాలు జూలై 17న విడుదలకు సిద్థమయ్యాయి. లయ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు విడుదల కావడం విశేషమే.
ప్రముఖ కథానాయిక లయ వివాహానంతరం కాస్తంత గ్యాప్ ఇచ్చి 'తమ్ముడు' సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా నటించిన ఆ సినిమాలో హీరో అక్కయ్యకగా కీలక పాత్రను పోషించింది. అయితే ఆ చిత్రం విజయవంతం కాలేదు. ఆ వెంటనే తనకు బాగా అచ్చి వచ్చిన హీరో శివాజీ సరసన 'సంప్రదాయిని సుప్పిని సిద్దపూసని' చిత్రంలో నాయికగా నటించింది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.
నటిగా చక్కని గుర్తింపు ఉన్న లయ కెరీర్ కు ఈ పరాజయాలు అడ్డంకి కాలేదు. ప్రస్తుతం ఆమె తన 'మనోహరం' హీరో జగపతిబాబు సరసన 'వదలా' చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ విడుదలకు సిద్థంగా ఉంది. తాజాగా దీని ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అలానే శ్రీకాంత్ సరసన గతంలో పలు చిత్రాల్లో నటించిన లయ ఇప్పుడు 'మిస్టర్ మిడిల్ క్లాస్'తో మరోసారి అతనితో జత కట్టింది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సైతం విడుదలకు రెడీగా ఉంది. చిత్రం ఏమంటే.. ఇప్పటికే 'వదలా' చిత్రాన్ని జూలై 17న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ చెప్పగా, తాజాగా 'మిస్టర్ మిడిల్ క్లాస్' మూవీనే అదే రోజున జనం ముందుకు తీసుకొస్తున్నట్టు దాని దర్శక నిర్మాతలు ప్రకటించారు. వీరిద్దరిలో ఎవరైనా రాజీ పడి వెనక్కి వెళితే ఓకే... లేకపోతే లయ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవుతాయి. మరి ఈ రెండు సినిమాల తర్వాత లయకు మరెన్ని అవకాశాలు వస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్ ఇచ్చిన ఒక్క అవకాశం.. గుమ్మడి జీవితాన్నే మార్చేసింది!
అక్కినేని ఫ్యామిలీ.. సెవెన్త్ సెంటిమెంట్! అఖిల్ గట్టెక్కేనా!!