ఎన్టీఆర్ ఇచ్చిన ఒక్క అవకాశం.. గుమ్మడి జీవితాన్నే మార్చేసింది!
ABN , Publish Date - Jul 09 , 2026 | 08:59 AM
గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రయాణం, ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో అనుబంధం, విలక్షణ నటన, గుర్తుండిపోయే పాత్రలు, ఆసక్తికర విశేషాలు తెలుసుకోండి.
పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని తనదైన శైలిలో నటించి తెలుగు వారి మదిలో చెరగని ముద్ర వేసిన విశిష్ట నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు (Gummadi Venkateswara Rao) ఒకరు. ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగ్ చెబితే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్దిమందే ఉన్నారు. అటువంటి వారిలో మొదటి వరుసలో నిలిచిన వ్యక్తి గుమ్మడి. సుస్పష్టమైన వాచకం ఆయన సొంతం. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం.. జానర్ ఏదైనా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసిన గొప్పనటుడు. ముఖ్యంగా సాత్వికాభినయంలో ఆయన దిట్ట. గుమ్మడి శత జయంతి సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్బంగా ఓ ప్రత్యేక కథనం.
ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రల్ని, వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను, మనస్తత్వాలను పరిశీలించేవారు గుమ్మడి. అప్పుడు తనకు అనుకూలంగా తన పాత్రను మలుచుకుని సజీవ రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెడుతూ నటించేవారు. గుమ్మడి పోషించిన పాత్రలను పరిశీలిస్తే అవి అభినయించినట్లుగా ఉండవు. మన ఇంట్లో మనిషినో, పక్కింటి పెద్దమనిషినో గుర్తు చేస్తాయి. అందుకే తెరపై గుమ్మడి కనిపిస్తే చాలు ఆడియన్స్ రిలీఫ్ ఫీలయ్యేవారు. తెలుగుదనం ఉట్టిపడే పంచె కట్టు, తెల్లని చొక్కా, పైన కండువా... చాలా సినిమాల్లో గుమ్మడి గెటప్ ఇదే.
నాలుగు తరాల నటులకు నాన్న వయసులో తనకంటే పెద్ద వారైన అగ్ర నటులు ఎన్టీఆర్, ఏయన్నార్‌లకు తండ్రిగా నటించి మెప్పించారు గుమ్మడి. అంతేకాదు దాదాపు నాలుగు తరాల తారలకు ‘నాన్న’గా నటించిన ఘనత ఆయన సొంతం. నాగయ్య తర్వాత నాన్న పాత్ర అనగానే ఆ రోజుల్లో గుర్తుకు వచ్చిన నటుడు గుమ్మడి మాత్రమే. ఇలా ఒకే రకం పాత్రను ఎన్నో చిత్రాల్లో పలురకాలుగా పోషించి, ప్రేక్షకులకు విసుగు కలిగించకుండా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించిన విలక్షణ నటుడు గుమ్మడి. అందుకే ఆయన ఏ పాత్ర పోషించినా అందులో ‘గుమ్మడి మార్కు’ కనిపించేది.
ఎన్టీఆర్ ప్రోత్సాహం
తెనాలి తాలుకా రావికంపాడు గ్రామంలో 1927 జులై 9న ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు గుమ్మడి వెంకటేశ్వరరావు. 1950లో వచ్చిన ‘అదృష్టదీపుడు’ చిత్రంతో ఆయన పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎందరెందరినో కలుసుకున్నారు. అయినా తగిన ప్రోత్సాహం లభించలేదు. చిన్న వేషమైనా వేస్తే నలుగురికి తెలుస్తుందనే ఆశతో ‘నవ్వితే నవరత్నాలు’, ‘పేరంటాలు’ వంటి సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో ఏర్పడిన పరిచయం గుమ్మడి కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. రాయలసీమ కరువు నివారణ నిధి వసూలు కోసం ఎన్టీఆర్ ఆంధ్రదేశంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గుమ్మడి కూడా పాల్గొన్నారు. ఆ టూరు నుంచి తిరిగిరాగానే తను నిర్మించే ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రంలో గుమ్మడికి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. నటుడిగా అప్పటికే పాపులారిటీ సంపాదించుకున్న ఎస్.వి.రంగారావు వేయదగిన పాత్ర అది. అయినా సరే రామారావు గుమ్మడిని పిలిచి ఆ వేషం ఇచ్చారు. ఆ అవకాశంతో తన భవిష్యత్‌ని నిలబెట్టుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ నిర్మించిన ‘తోడుదొంగలు’ చిత్రంలో కూడా మరో మంచి వేషం వేశారు. అలాగే ‘అర్ధాంగి’ చిత్రంలో అక్కినేనికి తండ్రిగా నటించారు. ప్రారంభంలోనే తన వయసుకి మించిన వేషాలు లభించడంతో ఇక అలాంటి పాత్రలే గుమ్మడిని వెదుక్కుంటూ వచ్చాయి.
విలన్ పాత్రల్లోనూ మెప్పించారు
క్యారెక్టర్ ఆర్టి్‌స్టగా మంచి పేరు తెచ్చుకున్న గుమ్మడి కరడు గట్టిన కసాయితనాన్ని మీసాల చాటున దాచి గుంభనంగా తడిగుడ్డతో గొంతులు కోసే పాత్రలు పోషించి మెప్పించారు. ‘ఏది నిజం’, ‘ఇద్దరు మిత్రులు’, ‘రాజమకుటం’ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించిన గుమ్మడి ఆ తరహా పాత్రలకు కూడా తగుదననిపించుకున్నారు.
ఎన్టీఆర్‌తో విభేదాలు
తన పిల్లల చదువు నిమిత్తం అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు షిఫ్ట్ అవడంతో ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా హైదరాబాద్‌లోనే సినిమాలు తీసేవారు. ఎన్టీఆర్ సినిమాల షూటింగ్స్ మాత్రం మద్రాసులో జరిగేవి. ఇటువంటి నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు రావడం
ఎన్టీఆర్‌కు ఇష్టం లేదు అనే దురభిప్రాయం మొదలైంది. ఎన్టీఆర్ నటించిన చిత్రాల పోస్టర్స్ మీద అక్కినేని అభిమానులు బురద జల్లడంతో వ్యవహారం జఠిలమైంది. ఎన్టీఆర్, అక్కినేని మధ్య గ్యాప్ పెరగడానికి ఇది కారణమైంది. హైదరాబాద్‌లో తనకు వ్యతిరేకంగా ఇంత జరుగుతున్నా తనకు ఆత్మీయుడని అనుకుంటున్న గుమ్మడి ఈ విషయాలను తనకు చెప్పలేదని ఎన్టీఆర్ ఆగ్రహించి, నాలుగేళ్ల పాటు ఆయన్ని దూరంగా ఉంచారు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి, మళ్లీ గుమ్మడిని చేరదీశారు.
గుండె పోటు పాత్రలు
గుమ్మడికి, గుండె జబ్బుకి విడదీయరాని అనుబంధం ఉండేదని చెప్పాలి. ఆ రోజుల్లో తిరుపతి వెంకన్నను దర్శించుకుని మద్రాసు వచ్చే యాత్రికులు గుమ్మడి ఇంటికి కూడా వెళుతుండేవారు. ‘పలానా సినిమాలో మీరు నటిస్తున్నారు కదా.. ఈసారైనా మీ పాత్ర చివరి వరకూ ఉంటుందా’ అని యాత్రికులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. వారి ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుమ్మడి మాట దాటేసేవారు. ఎందుకంటే ఆయన నటించిన దాదాపు 500 చిత్రాల్లో వందకు పైగా గుండె పోటుతో మరణించే పాత్రలే. ఒక దశలో ఇక విసుగేసి ‘ఈ గుండె జబ్బుతో చచ్చిన చావు చచ్చినట్లు చావకుండా చాలా సంవత్సరాలుగా చస్తూ వస్తున్నాను. ఇక ఇలాంటి వేషాలు ఇవ్వకండి బాబూ’ అని నిర్మాతలకు చెప్పేశారు గుమ్మడి. ఇక ఆ తర్వాత అలాంటి వేషాలు గుమ్మడికి బదులు మరో నటుడిని వెదుక్కున్నాయి.
బ్రాహ్మణ పాత్రల్లో వైవిధ్యం
ఛాందస బ్రాహ్మణ పాత్రలు అంతకుముందు ‘జయభేరి’, ‘జీవితరంగం’ వంటి చిత్రాల్లో పోషించారు గుమ్మడి. ముఖ్యంగా ‘జీవితరంగం’ సినిమాలో బ్రాహ్మణ పాత్ర పోషించమని దర్శకనిర్మాతలు అడగ్గానే ‘జేవీ రమణమూర్తి వంటి నటులు ఆ పాత్ర చేస్తే బాగుంటుంది. బ్రాహ్మణ్యాన్ని చక్కగా చూపించగల నటుడాయన. పైగా రంగస్థల కళాకారులు. మీ సబ్జెక్ట్ అంతా బ్రాహ్మణ్యం మీదే నడుస్తుంది కనుక వారు అయితే బాగుంటుందేమో ఆలోచించండి’ అన్నారు గుమ్మడి. ‘లేదండీ.. సావిత్రి గారిని బుక్ చేశాం. ఆవిడ పక్కన మీలాంటి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితేనే బాగుంటుంది’ అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాత్ర పోషించారు గుమ్మడి. మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వాటికి పూర్తి విభిన్నమైంది ‘మరో మలుపు’ చిత్రంలోని పూజారి పాత్ర. పూట కూడా ఇల్లు గడవని దారిద్రంతో బతికే బక్క చిక్కిన పాత్ర అది. సనాతన ధర్మ మూఢ నమ్మకాలకు, ఛాందస భావాలకు ప్రతినిధి ఆ పాత్ర. కథ విని ‘ఇంత లావు ఉన్న నేను బక్క చిక్కిన బ్రాహ్మణుడి పాత్ర పోషించడం సమంజసంగా ఉండదు. సాక్షి రంగారావును పెట్టుకోండి. మంచి నటుడాయన. కానీ హాస్య పాత్రలకే ఆయన్ని పరిమితం చేశారు. సెంటిమెంట్ బాగా పండిస్తాడు’ అని దర్శకుడు వేజేళ్లతో చెప్పారు గుమ్మడి. ‘లేదండీ. డిస్ట్రిబ్యూటర్స్‌కు మీ పేరు చెప్పాం. మీరు వేయక తప్పదు’ అని అభ్యర్ధించడంతో అంగీకరించారు గుమ్మడి. అభినయానికి ప్రాధాన్యం ఇస్తూ తక్కువ డైలాగులతో ఆ పాత్ర నడిపించారు దర్శకుడు వేజెళ్ల. మొత్తం మీద రెండు పేజీల లోపే డైలాగులు ఉండడంతో రెండే రెండు గంటల్లో గుమ్మడి డబ్బింగ్ చెప్పేశారు. ఈ సినిమాలో విగ్గు పెట్టుకుని నటించిన ఆయన షూటింగ్ చివరి రోజున ‘ఈ పాత్ర ఇంత బాగా వస్తుందని ముందే తెలిస్తే శుభ్రంగా గుండు కొట్టించుకుని నటించేవాడిని డైరెక్టర్‌గారు’ అన్నారట. ‘మరో మలుపు’ చిత్రం తర్వాత ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘ఈ పిల్లకు పెళ్లవుతుందా’, ‘రోజులు మారాయి’ వంటి చిత్రాల్లో గుమ్మడికి మంచి వేషాలు ఇచ్చి ఆయన సినీ జీవితాన్ని వేజెళ్ల పొడిగించారని చెప్పాలి.
గుమ్మడికి నూతన్‌ప్రసాద్ డబ్బింగ్
నటుడికి సొంత గొంతుకే ఆరో ప్రాణం అని గుమ్మడి చెబుతుండేవారు. 40 ఏళ్లకు పైగా గంభీరమైన తన గొంతుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ‘ఆయనకిద్దరు’ చిత్రంలో నటిస్తున్నప్పుడు గొంతుకు ఇబ్బంది ఎదురై డబ్బింగ్ చెప్పడం కష్టమైంది. దాంతో ఆయనకు మరో మంచి నటుడు నూతన్‌ప్రసాద్‌తో డబ్బింగ్ చెప్పించారు. ఇలా అరువు గొంతుతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇష్టం లేక ‘ఆయనకిద్దరు’ చిత్రం తర్వాత నటనకు దూరమయ్యారు గుమ్మడి. కానీ ‘జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర’(2007)లో శతాధిక వృద్ధుడి పాత్ర పోషించి, ఆ పాత్రకు తన గొంతు సరిపోతుంది కనుక తనే డబ్బింగ్ చెప్పారు. అదే గుమ్మడి ఆఖరి చిత్రం.