అక్కినేని ఫ్యామిలీ.. సెవెన్త్ సెంటిమెంట్! అఖిల్ గ‌ట్టేకేనా

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:21 PM

సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోన్న అఖిల్ కు 'లెనిన్' కలసి వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అఖిల్ లీడ్ రోల్ లో రూపొందిన ఏడో చిత్రం 'లెనిన్'. అక్కినేని ఫ్యామిలీలో 'సెవెన్త్ సెంటిమెంట్' ఉందని అది అఖిల్ కు కూడా అచ్చివస్తుందని అభిమానుల భావన.

akhil

అఖిల్ (Akhil) హీరోగా మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishor Abburu) దర్శకత్వంలో రూపొందిన 'లెనిన్స‌ (Lenin) మూవీ జూలై 10వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటిదాకా అఖిల్ హీరోగా రూపొందిన చిత్రాలేవీ అంతగా అలరించలేదు. దాంతో 'లెనిన్'పైనే అఖిల్, అక్కినేని అభిమానులు కూడా హోప్స్ పెట్టుకున్నారు. అఖిల్ లీడ్ రోల్ లో రూపొందిన ఏడవ చిత్రం 'లెనిన్'. అందువల్ల ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. చిరుత ప్రాయంలోనే చిన్నారి అఖిల్ 'సిసింద్రీ' మూవీలో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకున్నాడు. యంగ్ హీరో అయిన తరువాత ఇప్పటికి ఐదు చిత్రాల్లో హీరోగా నటించారు అఖిల్. 'లెనిన్' ఆయనకు ఆరో సినిమా. 'సిసింద్రీ'తోనూ లెక్కిస్తే అఖిల్ లీడ్ రోల్ లో కనిపించిన ఏడో చిత్రంగా 'లెనిన్' నిలవనుంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే అక్కినేని ఫ్యామిలీ హీరోస్ కు ఏడో సినిమా ఏదో విధంగా ఓ స్పెషల్ గా నిలుస్తుందని అంటున్నారు.

'కీలుగుర్రం' విజయభేరి..

అక్కినేని నటవంశానికి మూలపురుషుడు నట సమ్రాట్ ఏయన్నార్ (ANR). ఆయన తొలిసారి 'ధర్మపత్ని'లో చిన్నపాత్రలో తెరపై కనిపించినా 'శ్రీసీతారామ జననం' నుండే లీడ్ రోల్ లో నటించారు. అలా ఏయన్నార్ ఏడో సినిమాగా 1949 నాటి 'కీలుగుర్రం' నిలచింది. మీర్జాపురం రాజా దర్శకత్వంలో తెరకెక్కిన 'కీలుగుర్రం' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. ఈ మూవీ రజతోత్సవం చూసింది. అంతకు ముందు వచ్చిన ఏయన్నార్ 'బాలరాజు' కన్నా మిన్నగా 'కీలుగుర్రం' జయభేరీ మోగించడం విశేషం.

యన్టీఆర్ వ్యాఖ్యానం..

ఏయన్నార్ నటవారసునిగా వచ్చిన నాగార్జున ఏడో సినిమా 'అగ్నిపుత్రుడు'. తండ్రి ఏయన్నార్ తో కలసి నాగ్ నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ అంతగా అలరించకలేకపోయినా, అప్పట్లో నాగ్ సినిమాల్లో మంచి ఓపెనింగ్స్ చూసిన మూవీగా నిలచింది. నాగ్ వారసుడు నాగచైతన్య 'జోష్' మూవీతో తెరంగేట్రం చేశారు- ఆయన ఏడో సినిమాగా 'మనం' రూపొందింది. ఇందులో అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం విశేషం. ఈ మూవీ ఘనవిజయం సాధించింది.

ఇలా అక్కినేని హీరోలందరికీ ఏడో సినిమాలు అచ్చివచ్చాయి. నాగ్, నాగచైతన్య ఏడో చిత్రాల్లో ఏయన్నార్ కూడా కనిపించడం విశేషం. ఇప్పుడు అఖిల్ ఏడో సినిమా 'లెనిన్'కు ఆయన తండ్రి నాగార్జున నిర్మాణ భాగస్వామి. మరి ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఈ చిత్రానికి నందమూరి నటవంశం మూడోతరం స్టార్ హీరో యన్టీఆర్ ( Jr NTR ) 'వాయిస్ ఓవర్' ఇచ్చారు. మరి అఖిల్ ఏడో సినిమాగా వస్తోన్న 'లెనిన్' ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

Updated Date - Jul 08 , 2026 | 09:43 PM