సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Laya: సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఒకే రోజు రెండు సినిమాలు!

ABN, Publish Date - Jul 13 , 2026 | 02:12 PM

ఈ శుక్రవారం వస్తున్న ఎనిమిది చిత్రాలలో రెండు సినిమాలు లయ నటించినవి కావడం విశేషం. ఆమె హీరోయిన్ గా నటించిన 'వదలా, మిస్టర్ మిడిల్ క్లాస్' జూలై 17న విడుదల అవుతున్నాయి.

Laya Two Movies

అందాల నటి లయ 'భద్రం కొడుకో' చిత్రంతో బాలనటిగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'స్వయంవరం'తో హీరోయిన్ గా ఎదిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో పలు అర్థవంతమైన చిత్రాలలో నటించిన లయ... ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకుంది. అయితే ఆ తర్వాత వివాహానంతరం అమెరికాకు వెళ్ళిపోవడంతో కొన్నేళ్ళు నటనకు దూరంగా ఉంది. ఆ మధ్య రవితేజ 'అమర్ అక్బర్ ఆంథోని' మూవీలో తన కూతురుతో కలిసి మెరుపులా మెరిసన లయ... గత యేడాది 'తమ్ముడు' సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. నితిన్ హీరోగా నటించిన ఆ సినిమా లయ అక్కగా నటించింది. కానీ ఆ సినిమా నిరాశ పర్చింది. ఆ తర్వాత తనకు బాగా కలిసి వచ్చిన శివాజీ సరసన లయ 'సంప్రదాయని సుప్పిని సుద్దపూసని' చిత్రంలో నాయికగా నటించింది. కానీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. గతంలో జగపతిబాబు సరసన 'మనోహరం'లో నటించి మంచి పేరు తెచ్చుకున్న లయ ఇప్పుడు మరోసారి ఆయనతోనే 'వదలా' చిత్రంలో చేస్తోంది. హృతికా శ్రీనివాస్ కీలక పాత్ర పోషించిన 'వదలా' హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాను ఆకెళ్ళ వి కృష్ణ తెరకెక్కించాడు. మూడు వారాల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమాకు మరింత మెరుగులద్ది జూలై 17న విడుదల చేస్తున్నట్టు జగపతి బాబు తెలిపారు.


విశేషం ఏమంటే... గతంలో శ్రీకాంత్‌ సరసన పలు చిత్రాలలో నటించిన లయ ఇప్పుడు 'మిస్టర్ మిడిల్ క్లాస్'మూవీలో హీరోయిన్ గా నటించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌ వేంకటేశ్వర స్వామిగా నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ మూవీని జి. నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కూడా జూలై 17నే రాబోతోంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో లయ హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రావడం కాకతాళీయం.

ఇదే విషయాన్ని 'వదలా' చిత్ర నిర్మాతల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన చాలా స్పోర్టివ్‌గా ఈ అంశాన్ని తీసుకున్నారు. 'ప్రతి వారం ఐదారు సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులో బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. లయ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రావడం తప్పేమీ కాదు. నిర్మాతలం ఎవరి వీలును బట్టి వాళ్ళం సినిమాలు రిలీజ్ చేస్తుంటాం. ఏ సినిమా బాగుంటే అది ఆడుతుంది... అంతే!' అని అన్నారు. ఈ వీకెండ్‌లో ఎనిమిది చిత్రాలు విడుదల అవుతుండగా, అందులో లయవి రెండు సినిమాలు. మరి వీటిల్లో ఏయే సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

మహేశ్‌ బాబాయ్‌ మెచ్చుకున్నారు! ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వ‌స్తారు

నితిన్‌తో.. నాని సినిమా! ఈ సారైనా.. హిట్టు ప‌డేనా?

విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ‘జననాయగన్’ మళ్లీ వాయిదా..

Updated Date - Jul 13 , 2026 | 02:13 PM