‘కొరియన్ కనకరాజు’ నాయికపైనే ఇప్పుడందరి చూపు..!
ABN, Publish Date - Aug 07 , 2026 | 03:04 PM
‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ కూడా హిట్టు కొట్టేశాడని టాక్. పెదనాన్న చిరంజీవి సైతం వరుణ్ తేజ్‌కు ఈ మూవీ అందించిన సక్సెస్‌ను అభినందించారు. ఇక ఈ పిక్చర్ హీరోయిన్ రితికా నాయక్ ‘గోల్డెన్ లెగ్’ అనే ట్యాగ్ సంపాదించేసింది
‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju)తో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా హిట్టు కొట్టేశాడని టాక్. పెదనాన్న చిరంజీవి (Chiranjeevi) సైతం వరుణ్ తేజ్‌కు ఈ మూవీ అందించిన సక్సెస్‌ను అభినందించారు. ఇక ఈ పిక్చర్ హీరోయిన్ రితికా నాయక్ ‘గోల్డెన్ లెగ్’ అనే ట్యాగ్ సంపాదించేసింది. వింటూంటేనే భలేగా ఉంది కదూ.. ఆ ముచ్చటలోకి వెళితే..
ఎవరికైనా సక్సెస్ ఇచ్చే కిక్కే వేరబ్బా !.. ‘ఎఫ్-3’ తరువాత వరుణ్ తేజ్‌కు సరైన సక్సెస్ లేదు. ఆ సినిమాలోనూ వెంకటేశ్ మెయిన్ హీరోగా కౌంట్ అయిపోయారు. దాంతో వరుణ్‌కు సోలోగా సక్సెస్ లేక చాలా రోజులైంది. ‘ఎఫ్-3’ తర్వాత వరుణ్ నటించిన ‘గాండీవధారి అర్జున, ఆపరేషన్ వేలంటైన్, మట్కా’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దీంతో, వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’పైనే అందరికీ ఆశలు ఉండేవి. వాటిని నిజం చేస్తూ ఆగస్ట్ 7న విడుదలైన ఈ సినిమా గుడ్ టాక్ సంపాదించింది. యు.వి. క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ టాక్ వస్తోందని వరుణ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో టీమ్‌ను అభినందించారు. చిరంజీవి విషెస్ కూడా ‘కొరియన్ కనకరాజు’కు దీవెనగా మారాయి.
‘కొరియన్ కనకరాజు’లో హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్ (Ritika Naik)ను ‘బంగారు పాదం’ అంటున్నారు సినీజనం. ఆమె నటించిన తొలి చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సరదాగా సాగిందే తప్ప.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత నాని హీరోగా రూపొందిన ‘హాయ్ నాన్న’లో కేమియో రోల్‌లో కనిపించింది రితిక.. ఆ మూవీ మంచి విజయం సాధించింది. రితిక సోలో హీరోయిన్‌గా రూపొందిన ‘మిరాయ్’ బంపర్ హిట్టయింది. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ కూడా గుడ్ టాక్ సంపాదించడంతో రితికను ‘గోల్డెన్ లెగ్’గా అభివర్ణిస్తున్నారు సినీజనం. ప్రస్తుతం రితిక హీరోయిన్‌గా ఆనంద్ దేవరకొండ సినిమా ‘డ్యూయెట్’ తెరకెక్కుతోంది. ఈ సినిమా ఆరంభమై చాలా రోజులైంది. ఇప్పుడు రితిక ఖాతాలో మరో హిట్ పడడంతో ‘డ్యూయెట్’ షూటింగ్ వేగం పుంజుకుంటుందేమో చూడాలి. మరోవైపు రితికను తమ సినిమాలలో నటింపజేసేందుకు పలువురు క్యూలో ఉన్నారనేలా టాక్ మొదలైంది.
వరుణ్ తేజ్‌కు మొదటి నుంచీ సినిమాలు వస్తున్నాయి కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ దరి చేరడం లేదు. వరుణ్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘ముకుంద’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ సక్సెస్ చూడలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో ‘కంచె’ మంచి పేరు సంపాదించింది. ఆరంభంలోనే వరుస ఫ్లాపులు చూసిన వరుణ్ ‘ఫిదా’తో బిగ్ హిట్ అందుకున్నారు.. వెంటనే ‘తొలిప్రేమ’ సైతం సక్సెస్ రూటులో సాగింది. ఆ పై ‘ఎఫ్-2, గద్దల కొండ గణేశ్, ఎఫ్ 3’ మాత్రమే వరుణ్‌కు హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’తో గుడ్ టాక్ సంపాదించారు. ఈ మూవీ రేంజ్ ఏంటో వారం అయ్యాక తెలుస్తుంది. వరుణ్ తదుపరి చిత్రం ఆయన చెల్లెలు నిహారిక నిర్మిస్తోన్న ‘బరి’. ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలున్నాయి. మొత్తంగా చూస్తే ఇన్నాళ్లూ వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న వరుణ్ తేజ్.. ఈ కనకరాజు ఇచ్చిన ఊపుతో ఇకపై వరుస విజయాలు అందుకుంటారేమో చూద్దాం.
ఈ వార్తలపై కూడా ఓ లుక్ వేయండి:
‘బాహుబలి’ని దాచాడు కానీ.. మహేష్‌ని జక్కన్న దాచలేకపోతున్నాడా
కొరియన్ కనకరాజు టాక్‌పై మెగాస్టార్ స్పందనిదే..
Lenin OTT: లెనిన్.. ఓటీటీకి వచ్చేశాడు