Prabhas: నషా ముక్త్ భారత్ ప్రచారంలోకి ప్రభాస్
ABN, Publish Date - Nov 22 , 2026 | 05:43 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిశారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా చేపట్టిన నషా ముక్త్ భారత్ ప్రచారానికి మద్దతు ఇవ్వాలని ఆహ్వానించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు (Prabhas) దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయనకు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం కావాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి ఓ కీలక కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్’ (Nasha Mukt Bharat) ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభాస్‌ను ఆహ్వానించారు. యువతను డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం, వాటి వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన విషయాన్ని కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
"డ్రగ్స్‌పై పోరాటం చేయాలంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. ఈరోజు హైదరాబాద్‌లో నటుడు ప్రభాస్ ను కలవడం ఆనందంగా ఉంది. ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆయనను ఆహ్వానించాను. ఈ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు లభిస్తే, ముఖ్యంగా యువతతో పాటు లక్షలాది మంది అభిమానులు డ్రగ్స్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడేందుకు స్ఫూర్తి లభిస్తుంది. ఈ సందర్భంగా వాక్ థాన్‌కు సంబంధించిన అధికారిక టీషర్ట్‌ను కూడా ఆయనకు అందజేశాను. ‘వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ’ అనే గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్ప స్ఫూర్తితో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి మన సమష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేద్దాం' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ALSO READ:
హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యూనరేషన్ పెంచేసిన సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?
‘నీతో ఓ అడుగు’.. ‘రాయవలస’ ప్రేమ గీతం అదిరింది
Megaverse: పవన్, ప్రభాస్, సూర్య.. లిస్ట్ చూస్తుంటే మతిపోతోందిగా