Kajal: టాలీవుడ్ రుణం తీర్చుకున్న కాజల్.. బాలీవుడ్ భామలకు స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Nov 15 , 2026 | 02:06 PM
కొందరు తారలు ఇతర ఇండస్ట్రీల్లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమకు తొలి అవకాశాలు ఇచ్చిన చిత్ర పరిశ్రమను, అక్కడి ప్రేక్షకులను మర్చిపోతుంటారు. మరికొందరు పరోక్షంగా టాలీవుడ్‌పై చిన్నచూపు చూసేలా మాట్లాడుతుంటారు.
సినిమా రంగంలో అవకాశాల కోసం ఒక భాషలో అడుగుపెట్టి, ఆ తర్వాత ఇతర భాషల్లో స్టార్డమ్ సంపాదించుకోవడం సాధారణమే. అయితే కొందరు తారలు ఇతర ఇండస్ట్రీల్లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమకు తొలి అవకాశాలు ఇచ్చిన చిత్ర పరిశ్రమను, అక్కడి ప్రేక్షకులను మర్చిపోతుంటారు. మరికొందరు పరోక్షంగా టాలీవుడ్‌పై చిన్నచూపు చూసేలా మాట్లాడుతుంటారు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal) మాత్రం తన మాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసినప్పటికీ తనకు అసలైన గుర్తింపు, స్టార్డమ్ ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమేనని మరోసారి చాటిచెప్పింది.
ఇటీవల ఓ హిందీ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. పంజాబీ కుటుంబంలో జన్మించి ముంబైలో పెరిగినప్పటికీ, తన జీవితంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పింది. తన తొలి చిత్రం 'లక్ష్మీ కళ్యాణం'తో ప్రారంభమైన సినీ ప్రయాణం తనను నటిగా తీర్చిదిద్దిందని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యానని తెలిపింది. కాజల్ కెరీర్లో టాలీవుడ్ పాత్ర ఎంతో కీలకం. 'చందమామ', 'మగధీర', 'డార్లింగ్', 'బృందావనం', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'బిజినెస్‌మ్యాన్', 'బాద్షా', 'టెంపర్' వంటి చిత్రాలతో ఆమె అగ్ర కథానాయికగా ఎదిగింది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణతోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ సందర్భంగా తనకు తెలుగు భాష, సంస్కృతితో ఏర్పడిన అనుబంధాన్ని కూడా కాజల్ వివరించింది. తన యవ్వనంలో ఎక్కువ సమయం తెలుగు చిత్ర పరిశ్రమలోనే గడిచిందని, ఆ క్రమంలో తాను కూడా ఒక తెలుగు అమ్మాయిలా మారిపోయానని చెప్పుకొచ్చింది. అంతేకాదు, తన వివాహ సమయంలోనూ తెలుగు సంప్రదాయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించింది. తన జీవితంలో భాగమైన ఈ సంస్కృతిని ఎంతో ఇష్టంగా స్వీకరించానని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా ఇతర భాషల్లో స్టార్డమ్ సంపాదించిన తర్వాత తమ మూలాలను గుర్తుచేసుకోవడానికి కొందరు తారలు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ కాజల్ మాత్రం తనకు గుర్తింపు ఇచ్చిన పరిశ్రమను, అభిమానులను మర్చిపోకుండా కృతజ్ఞతను చాటుకుంటోంది. అందుకే ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కాజల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్‌కు వెళ్లినా టాలీవుడ్‌ను మర్చిపోని ఆమె వైఖరి అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు.