చందమామకు సెకండ్ ఇన్నింగ్స్.. సెట్ అవుతుందా

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:29 PM

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ అంటే.. అది పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అని రెండు భాగాలుగా విడిపోతుంటుంది.

Kajal Aggarwal

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ అంటే.. అది పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అని రెండు భాగాలుగా విడిపోతుంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో హీరోయిన్ల విషయంలో పెళ్లి తర్వాత కెరీర్ దాదాపు ముగిసిపోతుందనేది ఒక బలమైన అభిప్రాయం ఉండిపోయింది. గ్లామర్ రోల్స్ చేయలేరనో లేక ఫామ్ కోల్పోతారనో.. కారణం ఏదైనా సెకండ్ ఇన్నింగ్స్‌లో సక్సెస్ అయిన వారు చాలా తక్కువ. కానీ, చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చేయడానికి సిద్ధమైపోయింది. 2026లో కాజల్ దూకుడు చూస్తుంటే.. పెళ్లి తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన మేజిక్ రిపీట్ అవుతుందని స్పష్టంగా కనిపిస్తోంది.

2020లో కరోనా సెగలు కక్కుతున్న సమయంలో, గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది కాజల్. పెళ్లి తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా స్లో అయిపోయింది. నిజానికి పెళ్లి తర్వాత ఆమె చేసిన సినిమాలు చేతివేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అందులో కూడా రెండు సినిమాల్లో కేవలం గెస్ట్ రోల్స్‌కే పరిమితమైంది. దీంతో కాజల్ కెరీర్ ఇక ముగిసినట్టే అని విశ్లేషకులు భావించారు. ఇలాంటి టైంలో కాజల్ దశను మార్చే ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే.. అది ఖచ్చితంగా రామాయణ సిరీస్ అని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కాజల్ మండోదరి పాత్రలో కనిపిస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ గా ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన కాజల్, ఇలాంటి వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఆమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ కానుంది.

దీంతో పాటు ది ఇండియన్ స్టోరీ అనే మూవీలో మెయిన్ లీడ్‌గా రాబోతోంది. సామాజిక ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అంటే కేవలం సౌత్ మాత్రమే కాదు, నార్త్ ఆడియన్స్‌ను కూడా తన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించేందుకు కాజల్ సిద్ధమైంది. కేవలం క్యారెక్టర్ రోల్స్ మాత్రమే కాదు, కమర్షియల్ సినిమాల్లో కూడా తన సత్తా ఇంకా తగ్గలేదని కాజల్ నిరూపించబోతోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK111లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. సీనియర్ హీరోల సరసన ఇప్పటికీ కాజల్ బెస్ట్ ఆప్షన్ అని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ కానుంది. వరుసగా భారీ ప్రాజెక్టులు, వెయిట్ ఉన్న పాత్రలు చూస్తుంటే.. కాజల్ అగర్వాల్ తన మునుపటి ఫామ్‌ను తిరిగి తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ చందమామ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

Updated Date - Apr 29 , 2026 | 03:52 PM