'బలగం' పోరితో కాలభైరవ పెళ్ళి!?

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:17 PM

టాలీవుడ్ హీరోలు పెళ్ళి బాట పట్టారు. ఒకరి వెనుక ఒకరు ఏడు అడుగుల బంధంలోకి ఎంటర్ అవుతున్నారు. బ్యాండ్ బాజాకు రూట్ క్లియర్ చేసుకుని డైరెక్ట్ వెడ్డింగ్ అనౌన్స్ మెంట్ చేసేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న మరో యంగ్ పెయిర్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ ఇప్పుడు పెళ్లిళ్లతో కళకళలాడుతోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ-రష్మిక, అల్లు శిరీష్-నయనిక వివాహం చేసుకోగా... మరో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్యను పరిచయం చేశాడు. ఈ బజ్‌ను కంటిన్యూ చేస్తూ తాజాగా మరో యంగ్ సెలబ్రెటీ గురించి ఓ గాసిప్ టాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది.


ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు కాలభైరవ సైతం గాయకుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నారు. అతను యంగ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట పరిచయం 'ఉస్తాద్' సినిమా సమయంలోనే జరిగిందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమాలో కాలభైరవ తమ్ముడు శ్రీ సింహా హీరోగా నటించాడు. అతనితో కావ్య కళ్యాణ్ రామ్ జోడీ కట్టింది. సినిమా సెట్‌లో మొదలైన వీరి స్నేహం క్రమంగా బలమైన ప్రేమ బంధంగా మారిందని అంటున్నారు. ఈ ప్రేమాయణం కొంతకాలంగా సాగుతున్నదేనని సినిమా వర్గాలు అంటున్నాయి.

కాలబైరవ, కావ్య ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్ళికి అంగీకారం తెలిపారని, త్వరలోనే వీరు వివాహ బంధంలోకి అడుగుపెడతారని అంటున్నారు. కాలభైరవ సోదరుడు శ్రీసింహా వివాహం 2024లో జరిగింది. సో... ఇక ఆలస్యం చేయకుండా కాలభైరవ వివాహాన్నీ చేయాలని కీరవాణి కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. కాబట్టి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చని అంటున్నారు.


ఇక కెరీర్ విషయానికి వస్తే.. 2003లో వచ్చిన 'గంగోత్రి'తో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. 'స్నేహమంటే ఇదేరా', 'ఠాగూర్', 'అడవి రాముడు', 'విజయేంద్ర వర్మ', 'బాలు', 'బన్నీ', 'సుభాష్ చంద్రబోస్', 'పాండురంగడు ' వంటి చిత్రాల్లో బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. 2022 లో వచ్చిన 'మసూద'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'బలగం'తో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇటు కాలబైరవ విషయానికి వస్తే... నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు గా సత్తా చాటారు. తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాలలో పాడాడు. ‘బాహుబ‌లి-2’లో పాడిన ' దండాల‌య్యా' పాట‌ అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. 2019లో వచ్చిన 'మత్తు వదలరా' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. అంతేకాక కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలసి పాడిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు’ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అదే సినిమాలో 'కొమురం భీముడో ' పాట కాలభైరవకు జాతీయ అవార్డును తెప్పిపెట్టింది. కెరీర్‌లో మంచి ఫామ్ లోనే ఉన్న ఈ జోడి పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Read Also: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌: ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా.. మాస్‌ బీట్‌ అదిరిపోయింది

Read Also: గురుశిష్యులతో రామ్ చరణ్ చేయనున్న మ్యాజిక్

Updated Date - Mar 10 , 2026 | 05:53 PM