Jr NTR: ఆ విరాళాలకు, ఎన్టీఆర్‌కు ఏం సంబంధం లేదు
ABN , Publish Date - May 14 , 2026 | 10:25 AM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై.. ఎన్టీఆర్ ఆఫీస్ బృందం స్పందించింది. ఆ వార్తలు నమ్మి, ఎవరూ విరాళాలు ఇవ్వవద్దంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of the Masses Jr NTR) అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై.. ఎన్టీఆర్ ఆఫీస్ బృందం స్పందించింది. ఆ వార్తలు నమ్మి, ఎవరూ విరాళాలు ఇవ్వవద్దంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం (Jr NTR Fans Association) పేరిట రానున్న రోజుల్లో రూ. 100 కోట్లు విరాళంగా సేకరించి, వాటితో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో.. ఫ్యాన్స్ కొందరు హడావుడి చేస్తున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఇలా చేయాలని ప్లాన్ చేస్తున్నారో.. లేదంటే ఇందులో ఏదైనా మోసం ఉందో తెలియదు కానీ.. ఫ్యాన్స్ పేరిట మొదలైన ఈ ప్రయత్నానికి వెంటనే ఎన్టీఆర్ అడ్డుకట్ట వేశారు. ఇలాంటి పనులు చేయవద్దంటూ ఎన్టీఆర్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఈ మేరకు ఎన్టీఆర్ ఆఫీస్ (Jr NTR Office) నుంచి వచ్చిన ప్రకటనలో.. ‘‘కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ పేరుతో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్‌కు ఎటువంటి సంబంధం లేదని, వీటిని ఆయన ఏ విధంగానూ ఆమోదించడం లేదని, అధికారికంగా స్పష్టం చేస్తున్నాము. వారితో లేదా వారి కార్యాలయంతో సంబంధం ఉన్నట్లుగా చూపబడుతున్న ఇటువంటి కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలను, శ్రేయోభిలాషులను, అభిమానులను కోరుతున్నాము. ఎటువంటి అధికారిక ప్రకటనలు, సంబంధాలు లేదా సామాజిక కార్యక్రమాలైనా.. నేరుగా ఎన్టీఆర్ (NTR) ద్వారా మాత్రమే వెల్లడించబడతాయి. మీ సహకారానికి, నిరంతర అభిమానానికి ధన్యవాదాలు’’ అని తెలిపారు.
దీంతో అభిమానుల అత్యుత్సాహానికి బ్రేక్ పడింది. ప్రస్తుతం సెలబ్రిటీల పొలిటికల్ ఎంట్రీ సక్సెస్ అవుతున్న నేపథ్యంలో, తమ అభిమాన హీరోని ప్రజల్లో ఉంచేలా అభిమానులు కొందరు ఈ రూ. 100 కోట్ల విరాళం ప్లాన్ చేశారు. ఏదో ఒక రోజు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, ఆయన వచ్చే నాటికి ఈ సేవా కార్యక్రమాలు ఆయనకు ఎంతగానో యూజ్ అవుతాయనేది అభిమాన సంఘాల ప్లాన్‌గా తెలుస్తోంది. ఇవేమీ నచ్చని ఎన్టీఆర్.. వెంటనే స్పందించి, ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం