‘దేవర’కు గ్రహణం వీడింది.. బుల్లితెరకు వచ్చే సమయం ఆసన్నమైంది
ABN, Publish Date - Nov 24 , 2026 | 12:06 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’. దాదాపు రెండేళ్ల అనంతరం ఈ మూవీ బుల్లితెరపై ప్రత్యక్షం కాబోతోంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’ (Devara) బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కమర్షియల్ సూపర్ హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2024 సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలై వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఆ తర్వాత ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్)లోనూ రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. అయితే సినిమా విడుదలై రెండేళ్లు దాటిపోయినప్పటికీ, ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై మాత్రం ప్రసారం కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. స్టార్ హీరో సినిమా అయి ఉండి కూడా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోకపోవడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు తెరపడుతూ ‘దేవర’ బుల్లితెర ఆగమనానికి మార్గం సుగమమైంది.
నిజానికి ‘దేవర’ శాటిలైట్ హక్కుల విషయంలో గతంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. మొదట స్టార్ గ్రూప్ ఈ హక్కులను కొనుగోలు చేసిందని, ఆ తర్వాత ఈటీవీ (ETV) సొంతం చేసుకునేందుకు చర్చలు జరిపిందని టాక్ నడిచింది. కానీ భారీ బడ్జెట్, రేట్ల కారణంగా ఆ ఛానెల్స్ సైతం వెనుకడుగు వేసినట్లు సమాచారం. అయితే తాజాగా అందుతున్న మీడియా కథనాల ప్రకారం.. ప్రముఖ నెట్‌వర్క్ సోనీ (Sony) ‘దేవర’ శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ‘సోనీ తెలుగు’ (Sony Telugu) ఛానెల్, 2027లో ప్రారంభం కానుంది.
కొత్త ఛానెల్ ప్రారంభోత్సవ వేళ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే భారీ సినిమాల లైబ్రరీని సిద్ధం చేసుకుంటున్న సోనీ, అందులో భాగంగానే ఎన్టీఆర్ ‘దేవర’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఛానెల్ ప్రసారాలు మొదలైన వెంటనే గ్రాండ్‌గా ‘దేవర’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వేసి టీఆర్పీ రేటింగ్స్‌లో సంచలనం సృష్టించాలని సోనీ ప్లాన్ చేస్తోంది. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా మెప్పించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరి రెండేళ్ల నిరీక్షణ తర్వాత బుల్లితెరపై ‘దేవర’ జాతర ఎప్పుడు మొదలవుతుందో చూడాలి!
ఇవి కూడా చదవండి:
ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి
Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు
ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు