‘జెట్లీ’ ప్రదర్శనను ఆపేయడం అన్యాయం- మైత్రీ సంచలన లేఖ
ABN, Publish Date - May 01 , 2026 | 06:04 PM
పర్సంటేజ్ సిస్టమ్ గొడవ కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలోనే నడుస్తుంటే, మైత్రీ వారి ‘జెట్లీ’ సినిమాను మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా ప్రదర్శన ఆపేశారు.
పర్సంటేజ్ విషయంలో టాలీవుడ్‌లో పంచాయితీ నడుస్తోన్న విషయం తెలిసిందే. పర్సంటేజ్ సిస్టమ్‌కు ఓకే అంటేనే థియేటర్స్ అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అంటుంటే.. పర్సంటేజ్ సిస్టమ్‌తో నడిచే థియేటర్లకు తమ సినిమాలను ఇచ్చేదిలేదని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఇలా ఈ పంచాయితీ నడుస్తుండగానే మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించిన ‘జెట్లీ’ (Jetlee) మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ఈ పర్సంటేజ్ సిస్టమ్ గొడవ కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలోనే నడుస్తుంటే, మైత్రీ వారి ‘జెట్లీ’ సినిమాను మల్టీప్లెక్స్ థియేటర్లలో కూడా ప్రదర్శన ఆపేశారు. దీంతో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP (Mythri Movie Distributors LLP) సంస్థ తరపున డెసిగ్నేటెడ్ పార్ట్‌నర్ కేతిరెడ్డి శశిధర్ (Kethireddy Sasidhar) ఓ లేఖను విడుదల చేశారు. ఇప్పుడీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో..
‘‘తెలంగాణలోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వీక్లీ రెంటల్, రెవెన్యూ షేరింగ్ నిబంధనలకు సంబంధించి కొనసాగుతున్న సమస్య గురించి మాకు అవగాహన ఉంది. ఈ విషయంలో మీ వైఖరిని నేను అర్థం చేసుకున్నాను. అలాగే, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా సంస్థ పంపిణీ చేసే చిత్రాలను ఆ సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శించకూడదని మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము అంగీకరించాము. మా రీసెంట్ సినిమాల విషయంలో కూడా ఇదే విధానాన్ని మేము అనుసరించాము. ఈ సమస్య ఇంకా పరిష్కారం కానప్పటికీ మీ నిర్ణయాన్ని మేము గౌరవించాము. కానీ, మా తాజా చిత్రం ‘జెట్లీ’ (Jetlee) విషయంలో జరిగింది మాత్రం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
మీ నియంత్రణలో ఉన్న మల్టీప్లెక్స్ ప్రాపర్టీలలో మా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. మల్టీప్లెక్స్ నిబంధనల విషయానికి వస్తే మన మధ్య ఎటువంటి సమస్య గానీ, విభేదాలు గానీ లేవు. అవి సింగిల్ స్క్రీన్ చర్చలకు పూర్తిగా భిన్నమైనవి. ఎలాంటి సంబంధం లేని విషయం కోసం మల్టీప్లెక్స్‌లలో మా సినిమాను ఆపివేయడం అన్యాయం. ఇది కేవలం అభిప్రాయ భేదం కాకుండా, కావాలనే మాపై ఒత్తిడి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక విభాగంలో తమ నిబంధనలను ఒప్పించడం కోసం, మరొక విభాగంలో సినిమాను అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు.. అది భయపెట్టి లొంగదీసుకోవడం కిందకే వస్తుంది. సింగిల్ స్క్రీన్ నిబంధనలకు మేము అంగీకరించేలా చేయడానికి, మల్టీప్లెక్స్ స్క్రీన్లను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారనే భావనను ఇది కలిగిస్తోంది. ఇది సరైనది కాదు. ఇది సినీ పరిశ్రమలో వ్యాపార నిర్వహణకు ఒక తప్పుడు సంకేతంగా నిలుస్తుంది.
మేము ఎప్పుడూ న్యాయమైన, పారదర్శకమైన లావాదేవీలను మాత్రమే నమ్ముతాము. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ ఒక రంగంలోని విభేదాలను, ఎటువంటి సమస్య లేని మరొక రంగానికి విస్తరించడం సరికాదు. మీరు ఈ నిర్ణయాన్ని పునరాలోచించి, మీ ఆధీనంలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎటువంటి ఆలస్యం లేకుండా ‘జెట్లీ’ చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాము. సింగిల్ స్క్రీన్ సమస్యపై మొదటి నుంచి మేము చెబుతున్నట్లుగానే న్యాయబద్ధమైన రీతిలో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చలు ఎక్కువ మంది అభిప్రాయంతో ఏకీభవించేలా జరగాలి తప్ప, ఈ విధంగా ఇతర వ్యాపారాలపై ఎఫెక్ట్ చూపించేలా ఉండకూడదు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము’’ అని కేతిరెడ్డి శశిధర్ ఈ లేఖలో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!
‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?