ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉద్రిక్తత.. జానీ మాస్టర్ భార్య పై దాడి
ABN, Publish Date - Sep 23 , 2026 | 07:22 PM
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం తారాస్థాయికి చేరి ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ అధ్యక్షురాలు సుమలతా దేవిపై రఘు మాస్టర్ టీమ్‌లోని మహిళా డ్యాన్సర్స్ దాడి చేయడంతో విషయం మరింత తీవ్రంగా మారింది.
హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పరిధిలో గల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం తారాస్థాయికి చేరి ఉద్రిక్తతలకు దారితీసింది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA)లో కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రస్తుత అధ్యక్షురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య (Jani Master Wife) అయిన సుమలత (Sumalatha) పాలకవర్గాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 225 మంది సభ్యులు హాజరైన భేటీలో సుమలతకు కేవలం 11 మంది మద్దతు మాత్రమే లభించగా, రఘు మాస్టర్ వర్గానికి ఏకంగా 214 మంది మద్దతు ప్రకటించడంతో ఫెడరేషన్ ఈ రద్దు నిర్ణయాన్ని ప్రకటించి, వచ్చే నెల అక్టోబర్ 11న అసోసియేషన్‌కు నూతన ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే ఈ ఎన్నికల ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
అసోసియేషన్‌కు సంబంధించిన అధికారిక లావాదేవీలు, గత సమావేశాల వివరాలు నిక్షిప్తమై ఉండే కీలకమైన ‘మినిట్స్ బుక్’ (Minutes Book) ఎవరి ఆధీనంలో ఉండాలనే అంశంపై ఫిల్మ్‌ఛాంబర్ ప్రాంగణంలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం మొదలైంది. ఒకవైపు అధికారం కోల్పోయిన మాజీ కార్యవర్గం, మరోవైపు మెజారిటీ మద్దతు ఉన్న రఘు మాస్టర్ వర్గం పరస్పరం ఎదురుపడటంతో మాటా మాటా పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ ఘర్షణ వాతావరణంలో జానీ మాస్టర్ భార్య సుమలతపై కొందరు తోటి డ్యాన్సర్లు భౌతిక దాడికి దిగడం కలకలం రేపింది. తోపులాట, కేకలతో ఫిల్మ్‌ఛాంబర్ ఆవరణ ఒక్కసారిగా రణరంగంగా మారిపోవడంతో తోటి సినీ కార్మికులు, పరిశ్రమ పెద్దలు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ దాడి ఘటన అనంతరం సుమలతా దేవి నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రఘు మాస్టర్ తరఫున ఉన్న కొందరు లేడీ డ్యాన్సర్లు తనపై పథకం ప్రకారమే మూకుమ్మడిగా దాడి చేశారని, తనను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా డ్యాన్సర్లే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సుమలత ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు సుమలత చేసిన ఆరోపణలను రఘు మాస్టర్ (Raghu Master) వర్గ సభ్యులు తీవ్రంగా తోసిపుచ్చారు. తమపై కావాలనే నిరాధారమైన నిందలు మోపుతున్నారని వారు మండిపడ్డారు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో అత్యధిక మెజారిటీ సభ్యులు తమవైపే ఉన్నారని, ఫెడరేషన్ స్వయంగా సుమలత కార్యవర్గాన్ని రద్దు చేయడంతో ఆ అక్కసును తట్టుకోలేకనే ఆమె ఇలాంటి తప్పుడు ఆరోపణలకు దిగుతోందని రఘు మాస్టర్ వర్గం స్పష్టం చేసింది. యూనియన్‌కు ఎంతో కీలకమైన మినిట్స్ బుక్‌ను సుమలత దౌర్జన్యంగా, అనధికారికంగా తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, తాము యూనియన్ ఆస్తి అయిన ఆ రికార్డును మాత్రమే కాపాడేందుకు అడ్డుకున్నామని ఆ వర్గానికి చెందిన లేడీ డ్యాన్సర్లు వివరించారు. ఎవరూ ఆమెపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని స్పష్టం చేశారు. అసోసియేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం, వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.
ఇవి కూడా చదవండి:
యూఎస్ మార్కెట్‌లో ‘ద ప్యారడైజ్’ రికార్డు.. మహేష్ సరసన నాని!
46 కోట్లు.. రాధ ఫిర్యాదుపై సోదరి అంబిక సవాల్
జానీ మాస్టర్ వైఫ్ సుమలతకు షాక్.. ఆమె కార్యవర్గం రద్దు