జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షాక్: AIFEC సమావేశంలో కీలక తీర్మానం
ABN, Publish Date - Sep 30 , 2026 | 02:48 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా వ్యవహారంలో ఫిల్మ్ ఫెడరేషన్లు మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా (Jani Master) వ్యవహారంలో ఫిల్మ్ ఫెడరేషన్లు మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నాయి. జానీ మాస్టర్‌పై కొనసాగుతున్న సహాయ నిరాకరణను (నాన్ కో-ఆపరేషన్) యథావిధిగా కొనసాగించాలని ‘ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్’ (AIFEC) ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) ప్రధాన కార్యదర్శి లంకా రాజేంద్రప్రసాద్ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారు.
సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన AIFEC సమావేశంలో దేశంలోని అన్ని సినీ, టీవీ పరిశ్రమల ఫెడరేషన్ల ప్రతినిధులు పాల్గొని ఈ అంశంపై సమగ్రంగా చర్చించినట్లుగా ఇందులో పేర్కొన్నారు.
ఫెడరేషన్ విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్య వివరాలు:
ఫెడరేషన్ నిర్ణయాలను, సభ్యుల సంక్షేమాన్ని కాదని స్వార్థం, స్వలాభం కోసం వ్యవహరిస్తూ.. కక్షపూరితంగా ప్రవర్తించడంతో పాటు ఫెడరేషన్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది.
తమ ఫెడరేషన్ సభ్యులకు అన్యాయం జరిగిన కారణంగా మొదటగా ముంబై ఫెడరేషన్ వారు జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ ప్రకటించినట్లు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబై ఫెడరేషన్ వాదనను, పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న అనంతరం.. భారతదేశంలోని సినీ, టీవీ రంగాలలో పనిచేస్తున్న అన్ని ఫెడరేషన్లు సైతం జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించాయి.
ఈ మేరకు జానీ బాషాపై దేశవ్యాప్తంగా నాన్ కో-ఆపరేషన్ అమలు చేయాలనే నిర్ణయాన్ని AIFECలోని అన్ని అనుబంధ ఫెడరేషన్లు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశాయి.
టాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ కార్మిక సమాఖ్యలు, ముంబై సహా అన్ని భాషల ఫెడరేషన్లు ముక్తకంఠంతో జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణను కొనసాగించాలని నిర్ణయించడంతో, ఆయన సినీ కెరీర్‌కు మరోసారి పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మరి దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Raashii Khanna: షారుఖ్ ఖాన్‌లా.. ఒక వారమైనా బతకాలనుంది
బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ న్యూస్.. ఇక ఆపడం కష్టమే!
ఉదారత చాటుకున్న.. ‘కాంచన’ నటుడు! గబ్బర్ సింగ్ రమేష్‌కి శ్రీమన్ సాయం