సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ 'రణబాలి' క‌థ ఇదేనా.. ఆ న‌వ‌ల నుంచి తీసుకున్నారా

ABN, Publish Date - Jan 27 , 2026 | 03:42 PM

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'రణబాలి' నవలా చిత్రమా!? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. బండి నారాయణస్వామి రాసిన 'శప్తభూమి' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారానికి టీజర్ విడుదల తర్వాత బలం చేకూరింది.

Vijay Devarakonda Ranabaali

ఒకప్పుడు తెలుగులో నవలా చిత్రాలకు కొదవలేదు. అయితే గత కొంతకాలంగా ఆ ట్రెండ్ పూర్తిగా తగ్గిపోయింది. పాపులర్ రైటర్స్ యద్దనపూడి సులోచనా రాణి, మాదిరెడ్డి సులోచన, కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి, సి. ఆనందరామం, వాసిరెడ్డి సీతాదేవి, యండమూరి వీరేంద్రనాథ్‌ (Yandamuri Veerendranath), మల్లాది వెంకటకృష్ణమూర్తి (Malladi Venkata Krishna Murthy) తదితరుల నవలలు సినిమాలుగా వచ్చి విశేష ఆదరణ పొందాయి.

ఆ తర్వాత కొత్తవాళ్ళు రాసిన కథాబలం ఉన్న నవలలు సైతం సినిమాలుగా వచ్చాయి. పరుచూరి బ్రదర్స్ వంటి వారు తాము రాసిన నవలలను సినిమాలుగా తీశారు. ఇప్పుడు యేడాదికి కనీసం ఒక నవలా చిత్రం కూడా రావడం లేదు. అయితే ప్రస్తుతం సెట్స్ ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonad) 'రణబాలి' (Ranabaali) సినిమా నవలా చిత్రమనే ప్రచారం జరుగుతోంది. రశ్మికా మందణ్ణ హీరోయిన్ గా ఈ సినిమాను రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా పేరును ప్రకటిస్తూ, మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. దీనిని చూసిన తర్వాత ఇది ప్రముఖ రచయిత బండి నారాయణస్వామి రాసిన 'శప్తభూమి' (Sapthabhoomi) నవల మాదిరిగానే ఉందని కొందరంటున్నారు. ఈ నవల 2017లో తానా నిర్వహించిన నవలల పోటీలో బహుమతిని పొందింది. అలానే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా పొందింది.


18వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన దారుణమైన కరువు అక్కడి ప్రజలను ఎలాంటి దుస్థితిలోకి నెట్టేసిందో తెలిపే నవల ఇది. ఆనాటి చారిత్రక సంఘటనలను బండి నారాయణస్వామి ఈ నవలలో పొందుపరిచారు. తాజాగా విడుదలైన 'రణబాలి' టీజర్ చూస్తే స్వాతంత్ర్యానికి పూర్వం రాయలసీమలో జరిగిన కథ అనేది అర్థమౌతోంది. అప్పటి ప్రజలు కరువు కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా ఇందులో చూపించారు.

అయితే... కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న టీజర్ ను చూసి ఈ సినిమాకు ఆ నవలే ఆధారం అని చెప్పలేమని కొందరంటున్నారు. రాయలసీమలో బ్రిటీషర్స్ తలపెట్టిన అకృత్యాలను ఓ పోరాట యోధుడు ఎలా ఎదుర్కొన్నాడనేదే 'రణబాలి' సినిమా ప్రధానాంశమని అర్థమౌతోంది. ఇదే సమయంలో సినిమాకు రచన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసినట్టుగా ఉంది. నిజంగానే బండి నారాయణ స్వామి నవలతోనే ఈ 'రణబాలి'ని తీసినట్టయితే ఆయన పేరు ఖచ్చితంగా పేర్కొనే వారు కదా!? అని మరి కొందరు అంటున్నారు.


కొంతకాలం క్రితం దర్శకుడు క్రిష్ కూడా రాయలసీమకే చెందిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవలను సినిమాగా తీశారు. ఆ నవల కూడా తానా పోటీలో ప్రధమ బహుమతిని అందుకుంది. కానీ ఆ నవల సినిమాగా తెరకెక్కిన క్రమంలో పట్టు సడలిపోయి... పరాజయం పాలైంది. 'ఉప్పెన' తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఇది. ఎంతో ఇష్టంగా క్రిష్ ఆ నవలను సినిమాగా తీసినా... ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అందుకే ముందే కథను రివీల్ చేయడం ఇష్టంలేక మేకర్స్, రచయితకు పారితోషికాన్ని ఇచ్చి హక్కుల్ని తీసుకున్నారేమో! అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఏది ఏమైనా విడుదల నాటికి ఇది 'శప్తభూమి' నవల ఆధారంగా తెరకెక్కిన మూవీనా కాదా అనేది మేకర్స్ చెబుతారేమో చూద్దాం.

Updated Date - Jan 27 , 2026 | 03:48 PM