గురు స్వాములు, మాల ధారులను అవమానిస్తారా.. అయ్యప్ప భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ABN, Publish Date - Sep 08 , 2026 | 04:37 PM
ఇరుముడి టైటిల్‌తో అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆరోపించింది.
రవితేజ (Ravi Teja) హీరోగా ఇరుముడి (Irumudi) టైటిల్‌తో అయ్యప్ప భక్తుల (Ayyappa Devotees) మనోభావాలను దెబ్బతీశారని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆరోపించింది. సినిమా హిట్ కావడంపై అభ్యంతరం లేదని, పవిత్రమైన టైటిల్‌కు కథతో సంబంధమేంటని సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ప్రశ్నించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సమితి ప్రచార కార్యదర్శి ప్రేమ్ గాంధీతో కలిసి ఆయన మాట్లాడారు. ఇరుముడి చిత్రంలో కేవలం రెండు పాటలు తప్ప ఏ ఒక్క సన్నివేశం భక్తి భావాన్ని పెంపొందించేలా లేవని, మాల ధరించే వారిని కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారని మండిపడ్డారు. సినిమా విడుదలైన తర్వాత తామంతా సినిమా వీక్షించామని, అందులో అయ్యప్ప దీక్ష, గురుస్వాముల (Guruswamy) పాత్రలను చూపించిన తీరు, చిత్రీకరించిన విధానం వారి గౌరవం, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడ్డారు.
అలాగే, నేరాలు, వాణిజ్య అంశాల చుట్టూ తిరిగే కథకు ‘ఇరుముడి’ అనే పవిత్రమైన పేరును పెట్టడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకు ‘ఇరుముడి’ అనేది అత్యంత పవిత్రమైనది. శబరిమల యాత్రలో భాగంగా భక్తులు తలపై మోసుకెళ్లే ఆ పవిత్ర మూటనే ఇరుముడిగా పిలుస్తారు. అలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న పదాన్ని ఒక కమర్షియల్ క్రైమ్ కథకు శీర్షికగా ఉపయోగించడం సరైంది కాదని సమితి సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే.. ఈ వివాదంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందన లేదు గానీ సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటికే సినిమాలో ప్రభుత్వ పాఠశాలను చూపించడంతో , ఉపాధ్యాయురాలి పాత్రలపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా తాజాగా భక్తుల అభ్యంతరాల నేపథ్యంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.