Irumudi: ప్రేక్షకుల మనసు దోచిన ‘ఇరుముడి’.. రవితేజ ఏమన్నారంటే!
ABN, Publish Date - Aug 23 , 2026 | 09:51 AM
ఇరుముడి' ప్రేక్షకుల మనసు దోచిన సినిమా. కథ విన్నప్పుడే ఇది హిట్ అని గమనించాను. అందుకే విజయోత్సవ వేడుకలో మాట్లాడతానని ఎంతో నమ్మకంగా చెప్పా.
'ఇరుముడి'(Irumudi) ప్రేక్షకుల మనసు దోచిన సినిమా. కథ విన్నప్పుడే ఇది హిట్ అని గమనించాను. అందుకే విజయోత్సవ వేడుకలో మాట్లాడతానని ఎంతో నమ్మకంగా చెప్పా. అందరు సినిమాను థియేటర్లో చూడండి. కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాను మీ మనసులో పెట్టుకుంటారు' అని రవి తేజ(Ravi Teja) అన్నారు. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలో చిత్రబృందం చెన్నైలో హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
రవితేజ మాట్లాడుతూ "నటుడిగా నా ప్రయాణం మొదలైంది తమిళ చిత్ర పరిశ్రమలోనే. అందుకే తమిళ సినిమాతో నాకీ మంచి అనుబంధం ఉంది. ఇరుముడి నా కెరీర్ కు కీలకమైన సినిమా. అన్ని సమపాళ్లలో కుదిరి చక్కగా ఆడుతోంది. క్లైమాక్స్‌లో జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఇది నిజంగా హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్. నక్షత్ర భవిష్యత్తులో ఇంకా పెద్ద స్టార్ అవుతుంది. ప్రియా భవాని శంకర్ సహజంగా నటించింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనే సక్సెస్ మీట్‌లో మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా మీద మాకు మొదటి నుంచి అంత నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ తమిళనాడులో కూడా ఉండాలని నేను కోరుకున్నాను. అది జరిగింది. మా డైరెక్టర్ శివ నిర్వాణ అద్భుతంగా తీశారు' అని అన్నారు.
కథ వెంటాడుతుంది..
'నాకు తమిళ సినిమాలంటే చాలా ఇష్టం. మణిరత్నం, భారతీరాజా, శంకర్ గారి సినిమాలన్నీ చూస్తూ పెరిగాను. నేను డైరెక్టర్ అయిన తర్వాత నా సినిమా కూడా తమిళ్‌లో ఆడాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను. ‘ఖుషి’ సినిమా నాకు చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అందులోని పాటలను కూడా తమిళ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడ్డారు. ‘ఇరుముడి’ కథ అనుకున్నప్పుడే కచ్చితంగా ఈ సినిమాను తమిళ్‌లో కూడా చేయాలని అనుకున్నాం. ‘ఇరుముడి’లో డివోషనల్, ఫ్యామిలీ, క్రైమ్ అనే మూడు లేయర్స్ ఉన్నాయి. ఈ మూడు లేయర్స్ ప్రేక్షకులను షాక్ చేస్తాయి. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఈ కథ మిమ్మల్ని కచ్చితంగా వెంటాడుతుంది. తెలుగు ఆడియన్స్ సినిమాను చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. అలాంటి సెలబ్రేషన్స్ తమిళనాడులో కూడా చూడాలని నేను అనుకుంటున్నాను. రవితేజ గారు మాస్‌ను థియేటర్‌లోకి తీసుకొచ్చే స్టార్. ఆయనలో అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. త్రినాథ్ పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. కావేరి పాత్రకు ప్రియా భవాని శంకర్ గారు పూర్తిగా న్యాయం చేశారు. ఇలాంటి సినిమాకు మ్యూజిక్ జీవీ ప్రకాష్ గారు మాత్రమే చేయగలరు' అని శివ నిర్వాణ అన్నారు.