తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో 'ఐ యామ్ హ్యాండ్సమ్'
ABN, Publish Date - Jun 08 , 2026 | 03:50 PM
దుర్గా దేవ్ నాయుడు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా 'ఐ యామ్ హ్యాండ్సమ్'. కేదార్ నాథ్ నిర్మించిన ఈ సినిమా ఇదే నెల 12న విడుదల కాబోతోంది.
తండ్రీ కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’. సిన్స్ 2009 అనేది ట్యాగ్ లైన్. దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని మహేష్ గుడారు సమర్పణలో కేదార్‌నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో మూవీ ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, 'సినిమా విజయానికి అసలు బలం కంటెంట్. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినీ పరిశ్రమలో టాలెంట్‌కు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ, 'మాది ఏలూరు. మా నాన్న అరటిపండ్ల వ్యాపారి. చిన్న పట్టణం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నాకు నేనే స్టార్ అని గర్వంగా చెప్పుకుంటాను. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ ఇది నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సినిమా విజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. ఈ సినిమా విజయం పట్ల హీరోయిన్ అన్విష, నిర్మాత కేదార్ నాథ్, సంగీత దర్శకుడు ఎన్.ఎస్. ప్రసూ ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!