తెలుగులో వరుస విజయాలతో జీవీ ప్రకాశ్ కుమార్ హవా!

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:04 PM

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ తెలుగులో వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇరుముడి, విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత తాజాగా ఆకాశంలో ఒక తార సినిమాతో తన సంగీత ప్రతిభను మరోసారి చాటుకున్నారు.

GV Prakash Kumar

ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్‌ కుమార్ కూడా మంచి సంగీత దర్శకుడు. 'వెయిల్‌' సినిమాతో సంగీత దర్శకుడిగా 2006లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన జీవీ ప్రకాశ్‌ కుమార్ ఇంతవరకూ దాదాపు 125 చిత్రాలకు సంగీతం అందించారు. అందులో వివిధ భాషలకు చెందిన చిత్రాలు ఉన్నాయి. అయితే అత్యధిక శాతం తమిళ చిత్రాలే. ఇదిలా ఉంటే... జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే 2015లో 'డార్లింగ్‌' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది తెలుగు సినిమా 'ప్రేమ కథా చిత్రమ్‌'కు రీమేక్‌. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. గత యేడాది మార్చిలో వచ్చిన 'కింగ్ స్టన్' జీవీ ప్రకాశ్‌ కు హీరోగా 25వ చిత్రం. ఇప్పుడు అతను నటిస్తున్న సినిమాల సంఖ్య 30కి చేరింది.


విశేషం ఏమంటే ఈ మధ్య కాలంలో జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తెలుగులో పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అలా సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్‌ బాబు కొడుకు జైకృష్ణ హీరోగా పరిచయం అయిన 'శ్రీనివాస మంగాపురం'కు జీవీ ప్రకాశే మ్యూజిక్‌ అందించాడు. ఈ సినిమాలోని పాటలకు మంచి పేరు వచ్చినా... కమర్షియల్‌గా సినిమా సక్సెస్ కాలేదు. కాకపోతే కృష్ణ అభిమానులు మాత్రం ఓ సెంటర్‌లో ఈ సినిమాను వంద రోజులు ఆడించారు. ఇక ఆ తర్వాత వచ్చిన 'ఇరుముడి' సినిమా సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్‌ రేంజ్‌ను మరోసారి తెలియచేసింది. పాటలే కాదు... ఈ సినిమా కూడా సూపర్ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' మూవీకీ జీవీ ప్రకాశే సంగీతం అందించాడు. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇప్పుడు తాజాగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించిన 'ఆకాశంలో ఒక తార' మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ నేపథ్య గీతాలతోనే సాగింది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కథలోని ఆత్మను గుర్తించి, తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. ఈ సినిమాకు దక్కుతున్న విజయంలో అతనిదీ కీలకమైన పాత్రే. దాంతో జీవీ ప్రకాశ్‌ తెలుగులో వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్నాడనే చెప్పాలి.


టెక్నికల్‌గా చూస్తే... 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్' సినిమా తమిళ చిత్రం. తెలుగు దర్శక నిర్మాతలు తీసినా... దానిని వారు డబ్ చేశారు. కానీ ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో మంచి పేరును, విజయాన్ని అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా చూసినా... వీటి మధ్యలో వచ్చిన 'మండాడి' సినిమాకూ జీవీ ప్రకాశే సంగీతం ఇచ్చారు. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ రకంగా జీవీ ప్రకాశ్‌ హవా ఇప్పుడు బాగా వీస్తోంది.

ఇవి కూడా చదవండి:

Samantha: తల్లిదండ్రులైన సమంత-రాజ్ నిడిమోరు.. బాబుకి పేరు కూడా పెట్టేశారు..

‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది

Sai Pallavi: తాతయ్య ఇచ్చిన కానుక.. ఇప్పటికీ వదలని సాయి పల్లవి

శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Updated Date - Nov 20 , 2026 | 04:07 PM