Sai Pallavi: తాతయ్య ఇచ్చిన కానుక.. ఇప్పటికీ వదలని సాయి పల్లవి

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:46 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగాలంటే గ్లామర్‌ ఒక్కటే సరిపోదు, కొంచెం లక్‌ కూడా ఉండాలి. ఒక్కోసారి గ్లామర్‌ తో నెట్టుకొచ్చినా కూడా అది ఎక్కువ కాలం కొనసాగడం కష్టం.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగాలంటే గ్లామర్‌ ఒక్కటే సరిపోదు, కొంచెం లక్‌ కూడా ఉండాలి. ఒక్కోసారి గ్లామర్‌ తో నెట్టుకొచ్చినా కూడా అది ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. నటిగా పెర్ఫామెన్స్‌తోనే మెప్పించడం ఈ రోజుల్లో చాలా కీలకం. అలా గ్లామర్‌కు గ్లామర్‌ పంథాకు దూరంగా సహజత్వానికి దగ్గరగా సినిమాలు చేసే వాళ్లు అతి కొద్దిమందే ఉంటారు. వీరిలో అందరి కంటే ముందు వరుసలో ఉన్న నటి సాయి పల్లవి (Sai Pallavi). వీలైనంత వరకు ఆద్యాత్మికతకు దగ్గరగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. ఇక మేకప్ లేకుండా తెరపై మెరవాలన్నా, కోట్ల రూపాయల ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించాలన్నా అది ఆమెకే సాధ్యం. సినిమాల్లోనే కాదు, బయట ఈవెంట్స్‌లోనూ ఎంతో సింపుల్‌గా కనిపించే సాయి పల్లవిని చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అదే.. ఆమె చేతికి ఎప్పుడూ ఉండే ఒక రుద్రాక్ష మాల. అసలు ఆ మాల వెనుక ఉన్న అసలు కథేంటి? ఒక స్టార్ హీరోయిన్ సెంటిమెంట్‌గా మార్చుకున్న ఆ ప్రత్యేకమైన బంధం ఏంటి..?

రీసెంట్‌గా సాయి పల్లవి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఈ రుద్రాక్ష మాల తాలూకు సీక్రెట్‌ను పంచుకున్నారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం. ఈ మాలను తన కజిన్ తిరుచ్చిలోని ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీరంగం ఆలయం నుంచి తీసుకొచ్చారట. అయితే, ఆ మాలను ఆయన సాయి పల్లవికి నేరుగా ఇవ్వలేదు. ముందుగా తన తాతయ్య చేతుల్లో పెట్టారు. ఆ తర్వాత తాతయ్య ఎంతో ప్రేమతో ఆ రుద్రాక్ష మాలను సాయి పల్లవి చేతికి అందించారు. కుటుంబ బంధాలు, పెద్దల ఆశీర్వాదాలను అమితంగా గౌరవించే సాయి పల్లవికి ఆ క్షణం నుంచే ఆ మాల ఒక రక్షణ కవచంలా మారిపోయింది. ఈ మాల సాయి పల్లవి జీవితంలో ఎంత ప్రభావం చూపిందంటే.. చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్ ముందు రోజు ఆ రుద్రాక్ష మాలను చేత్తో పట్టుకుని దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకునేవారట. ఆశ్చర్యకరంగా అలా దండం పెట్టుకున్న ప్రతిసారీ పరీక్షలు ఎంతో అద్భుతంగా రాసేదాన్ని అని ఆమె స్వయంగా చెప్పారు.

సాయి పల్లవి సినిమాల పరంగానే కాదు, జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను పూర్తి చేసిన డాక్టర్ కూడా. ఆ తర్వాత ఇండియాలో అత్యంత కఠినమైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ లో కూడా ఘన విజయం సాధించారు. అలా స్టూడెంట్ లైఫ్‌లో మొదలైన ఆ నమ్మకం.. కాలక్రమేణా ఆమె దినచర్యగా మారిపోయింది. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు వెళ్లేటప్పుడు కూడా ఈ మాలను ధరించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి సినీ కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రణబీర్‌ కపూర్‌, నితీష్‌ తివారీ కాంబినేషన్‌లో వచ్చిన ఆద్యాత్మిక దృశ్యకావ్యం రామాయణ చిత్రంలో సీతగా సాయి పల్లవి నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక కోలీవుడ్‌లో ధనుష్‌ హీరోగా చేసిన 'ఓం' సినిమాలో నిత్యారెడ్డి అనే పోలీసాఫీర్‌గా నటించి అటు యాక్షన్‌ సీన్స్‌లోనూ మెప్పించింది. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోకుండా, తాతయ్య ఇచ్చిన ఆశీర్వాదాన్ని గుండెల్లో దాచుకునే ఇలాంటి స్వభావమే సాయి పల్లవిని మిగిలిన నటీమణులకు భిన్నంగా నిలబెడుతోంది.

ALSO READ:

‘వృషకర్మ’ నుంచి ‘ఛలో పదవే’ సాంగ్.. మెలోడీ అదిరింది

‘సలార్-2’ కంటే ముందే ‘డ్రాగన్-2’.. నీల్ ప్లాన్ ఇదేనా?

శర్వా ‘భోగి’ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Updated Date - Nov 20 , 2026 | 01:59 PM