హీరో కావాలన్న కలతో మద్రాసుకు.. మూడు సినిమాలు ఆగినా వెనక్కి తగ్గని గిరిబాబు!
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:56 PM
హీరో కావాలనే కలతో అసలు పేరు శేషారావుతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన గిరిబాబుకు తొలి మూడు సినిమాల్లోనూ నిరాశే ఎదురైంది. చివరకు 1973లో ‘జగమే మాయ’తో వెండితెరకు పరిచయమై నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 83 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.
కొత్తవాళ్ళకు సినిమా రంగం అనేది వడ్డించిన విస్తరి ఎంత మాత్రంకాదు. సినిమా రంగంలో ఐదారు దశాబ్దాల పాటు పాతుకుపోయారంటే... వాళ్ళకు ఎంతో అనుభవం ఉండి ఉండాలి. అలానే సినిమానే శ్వాసగా భావించి అయినా ఉండాలి. నవంబర్ 14న సికింద్రాబాద్ కిమ్స్ లో అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు కూడా అందుకు మినహాయింపు కాదు. సినిమాల్లోకి రావాలని, హీరోగా నటించాలని ఎన్నో కలలు కన్నారు. ఆయనకంటే ఆయన స్నేహితులు ఎంతగానే ప్రోత్సహించారు. గిరిబాబు తొలి రోజుల్లో తన అసలు పేరు (శేషారావు) తోనే సినిమా అవకాశాల కోసం తిరిగారు. సినిమా కంపెనీలకు ఫోటోలు పంపి వారి నుంచి వచ్చే కబురు కోసం ఎదురుచూస్తున్న శేషారావుకు ఓసారి నిజంగానే సమాచారం వచ్చింది. దాంతో 1966 డిసెంబర్ 31న బయలుదేరి 1967 జనవరి 1న శేషారావు మద్రాసులో రైలు దిగారు. ఎస్.డి. లాల్ దగ్గర అసోసియేట్ గా పనిచేసే సిద్ధ లింగయ్య ఆ సినిమాకు దర్శకుడు కాగా పాండు అనే ఆయన నిర్మాత. ఆ సినిమా పేరు 'ధైర్యే సాహసే లక్ష్మి'. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. ప్రకాశ్ కూ అదే మొదటి సినిమా. దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కలిసి గిరిబాబును ఇంటర్వ్యూ చేశారు. హీరోగా ఎంపిక చేశారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సైతం సూపర్ గా సాగింది. కానీ నిర్మాత పాండుకు ఆర్థికంగా సాయం చేస్తామని హామి ఇచ్చిన వారు జరుకోవడంతో 'ధైర్యే సాహసే లక్ష్మీ' సినిమా పట్టాలెక్కలేదు. అలా గిరిబాబు హీరోగా నటించాల్సిన మొదటి సినిమా తప్పిపోయింది.
రెండో సినిమాది మరో కథ. ప్రముఖ నటి, దర్శకురాలు జి. వరలక్ష్మి, రాజ్ కుమార్ అనే యువకుడిని హీరోగా పరిచయం చేస్తూ 'మూగజీవులు' అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అది విడుదల కాకముందే 'తప్పటడుగులు' పేరుతో మరో సినిమా ప్రకటించారామె. అందులో ఇద్దరు హీరోలు. ఒక హీరో రాజ్ కుమార్ కాగా మరో హీరోగా శేషారావును ఆమె ఎంపిక చేసుకున్నారు. అయితే జి. వరలక్ష్మి తొలిసారి దర్శకత్వం వహించిన 'మూగజీవులు' సినిమా విడుదలై పరాజయం పాలు కావడంతో 'తప్పటడుగులు' సినిమా ఆగిపోయింది. అప్పటి వరకూ శేషారావుగా తాను చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన తన పేరును గిరిబాబుగా మార్చుకున్నారు. ఆ సమయంలో ఎస్.డి.లాల్ నుంచి గిరిబాబుకు కబురు వచ్చింది. ఆయన తీయబోతున్న 'స్వర్గానికి నిచ్చెనలు' సినిమాలో గిరిబాబుకు హీరో ఛాన్స్ ఇచ్చారు ఎస్.డి.లాల్. హీరోయిన్ గా వై. విజయను ఎంపిక చేశారు. ఈ సినిమా మొదటి రెండు సినిమాల మాదిరిగా కాకుండా పట్టాలెక్కింది. అంతేకాదు... ఆరు రీల్స్ షూటింగ్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఎస్.డి. లాల్ కు వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా సినిమా పూర్తి కాలేదు. పేరు మార్చుకున్నా కలిసి రాలేదని భావిస్తున్న గిరిబాబుకు ఎ. పూర్ణ చంద్రరావు రూపంలో జాక్ పాట్ తగిలింది. పి.వి. సుబ్బారావుతో కలిసి ఏ. పూర్ణచంద్రరావు నిర్మించిన 'జగమే మాయ' చిత్రంతో గిరిబాబు వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాకు ఐ.యస్. మూర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1973 జూలై 28న విడుదలైంది. విశేషం ఏమంటే... 'జగమేమాయ' సినిమా విడుదల కాకుండానే గిరిబాబుకు దాదాపు ఇరవై సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అలా నటుడిగా కెరీర్ ప్రారంభించిన గిరిబాబు నిర్మాతగా, దర్శకుడిగానూ తనదైన ముద్రను తెలుగు తెరపై వేశారు.
ఫిల్మ్ ఛాంబర్‌కు గిరిబాబు పార్దీవ దేహం
83 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచిన గిరిబాబుకు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకూ ఫిల్మ్ నగర్ లోని ఛాంబర్లో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్దం ఉంచబోతున్నారు. ఆ తర్వాత గిరిబాబు స్వగ్రామం రావినూతలకు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం రావినూతలలో అంత్యక్రియలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
మంత్రాలు లేవు.. పురోహితులు లేరు.. అనిరుధ్ – కావ్య వివాహ పద్ధతి ఏంటో తెలుసా?
ఎన్టీఆర్ సినిమాకు ముందే.. చిరంజీవితో త్రివిక్రమ్ మూవీ?
మోక్షజ్ఞ కంటే ముందే.. నందమూరి కుటుంబం నుంచి మరో సినీ ఎంట్రీ!