సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘జెన్ జీ’ నాడి పట్టుకోవడం బ్రహ్మవిద్యా.. మరి ఇదేంటి?

ABN, Publish Date - Sep 14 , 2026 | 06:40 PM

సినీజనం ‘జెన్ జీ’ అభిరుచిని అనుసరించే సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పాతదనాన్ని జెన్ జీ అంతగా ఇష్టపడదని కొందరి మాట. అయితే సినిమాల సక్సెస్ చూస్తోంటే ఈ పరిశీలకుల మాటే తప్పని తేలుతోంది.

Gen Z movie taste

‘జెన్ జీ’ నాడిని పట్టుకోవడం అంత సులువు కాదని పలువురు అంటున్నారు. సినీజనం ‘జెన్ జీ’ అభిరుచిని అనుసరించే సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పాతదనాన్ని జెన్ జీ అంతగా ఇష్టపడదని కొందరి మాట. అయితే సినిమాల సక్సెస్ చూస్తోంటే ఈ పరిశీలకుల మాటే తప్పని తేలుతోంది. ఏ చిత్రసీమకైనా మహారాజపోషకులు యువతీయువకులు అనే చెప్పాలి. ఇది ఈ నాటి మాట కాదు - సినిమా వెలుగు చూసిన దగ్గర నుంచీ ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోన్న మాట. యువత ఆదరణ లేకుండా ఏ చిత్రమూ బాక్సాఫీస్‌ను షేక్ చేయలేదన్నది జగమెరిగిన సత్యం!. ‘జెన్ జీ’గా పేరొందిన నవతరం ప్రేక్షకులను ఆకర్షించడం అంత సులువు కాదని పరిశీలకులు అంటూ ఉన్నారు. ఈ తరం యువతీయువకుల అభిరుచిని పసిగట్టి వారిని థియేటర్స్‌కు రప్పించడం నిర్మాతలు, దర్శకులకు అగ్నిపరీక్ష అనీ సినీజనం అంటూ ఉంటారు. అయితే ఈ యేడాది టాప్ హిట్స్‌గా నిలచిన పలు ఇండియన్ మూవీస్‌ను పరిశీలిస్తే అన్ని తరాల్లోనూ యువతీయువకులు సాగినట్టుగానే ‘జెన్ జీ’ కూడా పయనిస్తోందని తెలుస్తోంది. వారిలో ఆదర్శాలు, సంప్రదాయాల పట్ల గౌరవం, బాంధవ్యాలు, స్నేహబంధం ఉన్నాయని స్పష్టమవుతోంది. అంతే కాదు దైవభక్తి, దేశభక్తి కూడా జెన్ జీలో అధికంగానే ఉన్నాయనీ రుజువవుతోంది. అందుకు నిదర్శనమే కేవలం రెండు కోట్ల రూపాయలతో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ్’ చిత్రం.. 150 కోట్లకు పైగా సాధించడమని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.


సినిమాల కంటే తమ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ తోనే నవతరం ఎక్కువ సమయం గడుపుతోందని పరిశీలకుల మాట. ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే గాసిప్స్, మీమ్స్, షార్ట్స్‌తో జెన్ జీ సాగుతోందని తెలుస్తోంది. ఇంటర్నెట్‌ను అత్యధిక సమయం ఉపయోగించడం వల్ల జెన్ జీలో ఏకాగ్రత క్షీణిస్తోందని, జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోందని, అసలు ఆలోచనా శక్తి కొరవడుతోందని మానసిక వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా వారికి ఎప్పుడు ఏది ఇష్టమో తెలుసుకోవడం కష్టంగా మారుతోందనీ వారి పరిశీలనలో తేలిందట. ఇలా మెదడు సరిగా పనిచేయక పోవడాన్ని ‘బ్రెయిన్ రాట్’ అంటారు. జెన్ జీ బ్రెయిన్ రాట్ కారణంగా సరైన సినిమాలను చూడలేకపోతోందనీ కొందరు మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ తరంలోనూ భక్తిభావం మెండుగా ఉందని, అందువల్లే డివోషనల్ మూవీస్‌ను విజయపథంలో పయనింప చేస్తున్నారని తెలుస్తోంది. అందుకు తాజా ఉదాహరణగా తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ఇరుముడి’ని చెప్పుకోవచ్చు. ఇందులోని కథాంశం పాత సినిమాల్లోలాగే ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్‌కు డివోషనల్ టచ్ ఇచ్చి ‘ఇరుముడి’ని రూపొందించారు డైరెక్టర్ శివ నిర్వాణ. అదే జెన్ జీని కూడా కట్టి పడేసింది.

నేలపై ఎన్నో తరాలు నడిచాయి.. ప్రతి తరంలోనూ యువత తెలివితేటలు ప్రదర్శిస్తూనే సాగింది. ప్రస్తుతం ఉన్న నవతరానికి తెలివితేటలతో పాటు టెక్నాలజీ కూడా తోడయింది. అందువల్ల గతంలోని యువతరం వలే కాకుండా.. జెన్ జీ తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతోంది. టెక్నాలజీని తమ అవసరాలకు అనువుగా ఉపయోగించుకుంటోంది. ఇంత తెలివైన తరాన్ని మన సినిమా థియేటర్స్‌కు రప్పించడం కష్టమని పలువురు భావించారు. అయితే నవతరాన్ని ఆకర్షించేలా సినిమాలు తీయగలిగితే తప్పకుండా విజయం సాధించగలమని పలువురు నిరూపించారు. జెన్ జీలో దేశభక్తి కూడా అధికంగానే ఉంది. ఆ కారణంగానే సరిహద్దు జవాన్ల జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘బోర్డర్-2’ను విజయపథంలో పయనించేలా చేశారు. 1997లో బంపర్ హిట్‌గా నిలచిన ‘బోర్డర్’ మూవీ ఫ్రాంచైజ్ లోనే ‘బోర్డర్-2’ రూపొందింది. అప్పటి నవతరం, ఇప్పటి జెన్ జీ ఒకే భావాలతో ‘బోర్డర్’ సిరీస్ సినిమాలను విజయపథంలో పయనింప చేయడం గమనార్హం!


అందరిలోనూ దైవభక్తి- దేశాభిమానం ఉండడం మంచిదే.. అయితే ఇతర మతాలను సైతం గౌరవించాలి- పరుల సంస్కృతీ సంప్రదాయాలకు సైతం తగిన విలువనివ్వాలి. ఇదే మన పెద్దలు, గురువులు బోధిస్తూ ఉంటారు. అలాంటి మాటలను ఈ తరం ఖాతరు చేయదని చాలామంది భావిస్తూంటారు. వారి అభిప్రాయం తప్పు అన్నట్టుగా జెన్ జీ సాగుతోంది. జాతీయ పర్వదినాల్లోనూ, మన పండుగల్లోనూ, సంప్రదాయ ఆచరణలోనూ మునుపటి తరాల కన్నా మిన్నగా జెన్ జీ ప్రాధాన్యమిస్తోంది. అందుకు నిదర్శనంగా ఆలయాల్లోనూ, జాతీయ ఉత్సవాల్లోనూ సంప్రదాయాలను తు.చ. తప్పక ఆచరిస్తున్న వైనం కనిపిస్తోంది. అదే తీరున సినిమాల్లోనూ పాత కథలే ఉన్నా, తమను మెప్పించేలా తెరకెక్కిస్తే తప్పక ఆదరిస్తున్నారు.

ఇక నవతరం ప్రేక్షకులకు సీనియర్ యాక్టర్స్ అంటే మొహం మొత్తేసిందని, వారిని జెన్ జీ ఆదరించదనీ కొందరు అదే పనిగా చెబుతూ ఉంటారు. అయితే టాలీవుడ్‌లో చిరంజీవి వంటి సీనియర్ స్టార్, బాలీవుడ్‌లో సన్నీడియోల్ లాంటి సీనియర్ యాక్టర్ నటించిన సినిమాలను ఈ యేడాది ఎంతగానో ఆదరించారు కదా. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలోని వినోదం ఈ తరాన్ని ఆకట్టుకొనేలా సాగింది. అందువల్ల సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా జెన్ జీ ఆ సినిమాను చూసి ఆనందించింది.


నవతరం ప్రేక్షకులకు అభూత కల్పనలు, మాయలు, మంత్రాలు అంటే అస్సలు గిట్టవు అనీ కొందరు చెబుతూంటారు. ఈ విషయంలోనూ సదరు పరిశీలకులకు జెల్లా కొట్టింది జెన్ జీ. ఎందుకంటే ఈ యేడాది మంచి విజయం సాధించిన తెలుగు చిత్రాలు ‘రాకాస’, ‘చెన్నై లవ్ స్టోరీ’ చూస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. తమిళంలో రూపొందిన ‘కరుప్పు’.. తెలుగులో ‘వీరభద్రుడు’గా అనువాదమై అలరించింది. అందులోని కథను కొందరు ‘హేతువు లేదు’ అంటూ కొట్టేయవచ్చు.. కానీ, ‘వీరభద్రుడు’ పంచిన వినోదం నిర్మాతలకు కోట్లు కురిపించింది. అభూత కల్పనలు సైతం వినోదం పంచితే ఆదరించడానికి మేం సిద్ధంగా ఉన్నామని జెన్ జీ నిరూపించింది. హిందీలోనూ ‘భూత్ బంగ్లా’ అదే తీరున ఆకట్టుకోవడం గమనార్హం.

ఈ యేడాది ఘనవిజయం సాధించిన భక్తిమిళిత చిత్రాలు, అభూత కల్పనలతో తెరకెక్కిన సినిమాలు, వినోదం పంచిన మూవీస్‌ను నవతరం ప్రేక్షకులు ఆదరించక పోయి ఉంటే అంతటి గ్రాండ్ సక్సెస్ లభించేదా? నవతరాన్ని ‘జెన్ జీ’ అంటూ పిలుస్తున్నప్పటి నుంచీ ఈ తరహా చిత్రాలు విజయం సాధిస్తూనే ఉన్నాయి. ఈ యేడాది ఆ తీరు మరింతగా సాగిందని చెప్పొచ్చు. అందువల్ల ‘జెన్ జీ’ని ఆకట్టుకోవడం కష్టం- వారి నాడి పట్టుకోవడం బ్రహ్మవిద్య అన్న భావనలను మానుకోవాలి. కేవలం భారీ బడ్జెట్ మూవీస్‌నే నవతరం ప్రేక్షకులు ఇష్టపడతారనుకుంటే పొరబాటని ‘హనుమాన్ అంశ్’ నిరూపించింది. తమను ఆకట్టుకొనే చిత్రాలు తీస్తే సీనియర్ హీరోస్ నటించినా ఆదరిస్తామనీ జెన్ జీ తేల్చి చెప్పేసింది. ఇంత కథ చెప్పిన తరువాతయినా మూవీ మేకర్స్ పరుగులు తీస్తూ మూస చిత్రాలు తీయకుండా, వైవిధ్యమున్న కథలతో సాగితే మంచిది. మరి ఆ బాటలో ఎందరు మూవీ మేకర్స్ సాగుతారో చూద్దాం..

ఇవి కూడా చదవండి:

చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ.. స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?

‘దేవర 2’కి బ్రేక్.. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ 600 కోట్ల పౌరాణిక విస్ఫోటనం!

హ్యాట్రిక్ కాంబో రిపీట్.. మరో భారీ మాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!

Updated Date - Sep 14 , 2026 | 06:40 PM