సినిమాలకు ప్రాంతీయ ముద్రలు ఎందుకు? వీకే నరేష్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:45 AM
‘గరివిడి లక్ష్మి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అడివి శేష్, వీకే నరేష్, ఆనంది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రైలర్, కళా ప్రదర్శనపై అడివి శేష్ ప్రశంసలు కురిపించారు.
‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi) సినిమా ట్రైలర్ బాగుంది. వేడుకలో నిర్వహించిన కళా ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ ఆ పాటలు వింటుంటే నాకు నా బాల్యం గుర్తుకొచ్చింది. నేను వైజాగ్‌లోనే పెరిగాను. ట్రైలర్ చూసిన తర్వాత ఆనందితో కలిసి నటించాలి అనిపించింది’ అని హీరో అడవి శేష్ అన్నారు. ఆనంది (Anandhi) లీడ్ రోల్‌లో గౌరి నాయుడు తెరకెక్కించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.
సినిమా ఈనెల 17న విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అడివి శేష్, దర్శకులు బాబీ కొల్లి, హరీష్ శంకర్, మారుతి పాల్గొన్నారు. గౌరీ నాయుడు మాట్లాడుతూ ‘ఆనంది స్టేజ్ ఎక్కితే నాకు పూనకం వచ్చేసేది. ఈ సినిమాను తను ఆడిస్తుంది, పాడిస్తుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది’ అని అన్నారు. ఆనంది మాట్లాడుతూ ‘రెండేళ్లుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాను. గరివిడి లక్ష్మి పాత్ర నాకు దేవుడిచ్చిన వరం’ అని అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘మా వైపు నుంచి అన్నీ మంచి సినిమాలే ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అది ‘గరివిడి లక్ష్మి’తో మొదలు కాబోతోంది’ అని అన్నారు.
సినిమాలకు ప్రాంతీయ సరిహద్దులు ఎందుకు?
‘గరివిడి లక్ష్మి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు వీకే నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో సినిమాలకు ప్రాంతీయ ముద్రలు వేయడం ఒక ప్యాషన్‌గా మారింది. తెలంగాణ సినిమా, ఉత్తరాంధ్ర సినిమా, రాయలసీమ సినిమా అంటూ విభజించడం సరికాదు. సినిమాను సినిమాగానే చూడాలి. పాటలకు, సంగీతానికి ఎలాంటి సరిహద్దులు ఉండవో, సినిమాలకు కూడా అలాంటి సరిహద్దులు ఉండకూడదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
అభిమాని హత్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్
ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!
నిన్న రాజశేఖర్.. నేడు విజయ శాంతి! అసలు బాలయ్యతో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివయ్య