Fight Maha: ఆగస్ట్ 21న అఖిల్ రాజ్ కొత్త సినిమా విడుదల
ABN, Publish Date - Aug 15 , 2026 | 03:40 PM
అఖిల్ రాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించిన సినిమా 'ఫైట్ మహా'. ఈ నెల 21న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.
'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అతను హీరోగా, నాగదుర్గ హీరోయిన్ గా 'శనార్తి' సినిమా షూటింగ్ శ్రావణ మాసం తొలి శుక్రవారం మొదలైంది. అలానే అతను ఇప్పటికే నటించిన 'క్రేజీ కళ్యాణం' సినిమా విడుదలకు సిద్థంగా ఉంది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ తో పాటు సీనియర్ నటుడు నరేశ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు చక్కని స్పందన లభించింది.
ఇదిలా ఉంటే అఖిల్ రాజ్ ఉడ్డెమారి ప్రధాన పాత్రను పోషించిన 'ఫైట్ మహా' సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమా ఇదే నెల 21న రిలీజ్ కానుంది. సునీల్, డాక్టర్ వాణి గోపీచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ భరత్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 'కలలు నిజమైతే నిజం ఎవరిది' అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ఆనంద్ చంద్ర రూపొందిస్తున్నారు. ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, వైజాగ్, కేరళలో జరిపారు.
ఇటీవల ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసినప్పుడు చక్కని అప్లాజ్ లభించింది. దీని గురించి ఆనంద్ చంద్ర మాట్లాడుతూ -‘ఇదో వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది. మహా అనేది మా మూవీలో మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన లైఫ్ తో ఫైట్ చేస్తుంటాడు. అందుకే 'ఫైట్ మహా' అనే టైటిల్ మా మూవీకి పెట్టాం. జీవితంలో నిరాశతో ఏదీ వదిలిపెట్టవద్దు, పోరాడుతూనే ఉండాలి అనే మంచి విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?
డీపీ మార్చిన రెబల్ స్టార్.. ఇక అంతా ‘ఫౌజీ’ గురించే!
పోతురాజు ఆహార్యంలో శ్రీహరి తనయుడు.. పోస్టర్ అదిరింది!