Varanasi: రాజమౌళి.. ప్రమోషన్స్ మొదలు పెట్టాడయ్యా! మహేశ్ ఫ్యాన్స్‌కు.. ఇక పూనకాలే!
ABN, Publish Date - Jan 30 , 2026 | 10:49 AM
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలయికలో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి (Varanasi) కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జేమ్స్ కామెరూన్ లాంటి దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి పనితనాన్ని మెచ్చుకోవడంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఇది భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ తో భారీగా హైప్ పెంచిన జక్కన్న ఆ అంచనాలను అందుకునేలా వారణాసిని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. ఫస్ట్ గ్లింప్స్ ఒక విజువల్ వండర్‌ను తలపిస్తుండగా, తాజాగా మేకర్స్ మొదలుపెట్టిన ప్రమోషన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రచార చిత్రాలను విభిన్నంగా ప్లాన్ చేయడంలో జక్కన్న స్టైలే వేరు. దానికి తగ్గట్టుగానే, సినిమా టైటిల్‌కు ప్రతీకగా నిలిచే వారణాసి పుణ్యక్షేత్రంలో భారీ హోర్డింగులు వెలిశాయి. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ పోస్టర్లలో ప్రధానంగా 2027 ఏప్రిల్ 7 అనే తేదీ కనిపిస్తోంది. "ఆ రోజున థియేటర్లలో కలుద్దాం" అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ డిజైన్లు, సినిమా విడుదల తేదీపై స్పష్టతనిస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకముందే ఈ తరహా పబ్లిసిటీ చేయడం రాజమౌళి మార్క్ వ్యూహమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తుండటం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ వార్తతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం స్పిరిట్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే 'స్పిరిట్' సినిమాను 2027 మార్చి 5న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'వారణాసి' చిత్రం 2027 ఏప్రిల్ 7న వస్తుండటంతో, ఈ రెండు భారీ ప్రాజెక్టుల మధ్య సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంటుంది. దీనివల్ల బాక్సాఫీస్ వద్ద అనవసరమైన పోటీ తప్పడమే కాకుండా, రెండు సినిమాలకు కావాల్సినన్ని థియేటర్లు, వసూళ్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ 'స్పిరిట్', మరోవైపు రాజమౌళి 'వారణాసి'.. ఇలా నెల రోజుల గ్యాప్‌లో రెండు క్రేజీ సినిమాలు వస్తుండడంతో సినీ అభిమానులకు పండగ అనే చెప్పాలి.