‘ఎల్‌జిబీటీ ఏ లీగల్ బ్యాటిల్’ చేయడానికి కారణమిదే- దర్శకుడు
ABN, Publish Date - Jun 22 , 2026 | 09:08 PM
గే, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితాలపై తీసిన కోర్ట్ రూమ్ డ్రామా ‘ఎల్‌జిబీటీ - ఏ లీగల్ బ్యాటిల్’. ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
పి. సునీల్ కుమార్ రెడ్డి (P Suneel Kumar Reddy) దర్శకత్వంలో.. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద సుభాష్ చక్రవర్తి రవడ (Subhash Chakravarthy Ravada) సహ నిర్మాతగా గే, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల జీవితాలపై తీసిన కోర్ట్ రూమ్ డ్రామా ‘ఎల్‌జిబీటీ - ఏ లీగల్ బ్యాటిల్’ (LGBT: A Legal Battle). ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నెరోన్హా, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్‌తో పాటు రియల్ ట్రాన్స్‌జెండర్ యాక్టర్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్‌గా ‘చంద్రముఖి, లైలా’ వంటి ప్రముఖ యాక్టివిస్టులు , గే యాక్టివిస్ట్ విష్ణు తేజ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 19న దేశవ్యాప్తంగా విడుదలై.. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గే, ట్రాన్స్‌జెండర్స్‌కు అండగా నిలుస్తున్న పలు సేవా సంస్థల నిర్వాహకులను సత్కరించారు.
తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా మాట్లాడుతూ.. ‘ఎల్‌జిబీటీ ఏ లీగల్ బ్యాటిల్’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. నేను ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన సునీల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు. మా సమస్యల్ని చెప్పే ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడే సమాజంలో మరికొంత మార్పు అనేది మొదలవుతుంది. కాబట్టి, ఈ సినిమా చూడని వారు తప్పకుండా థియేటర్లలో చూడాలని కోరుతున్నానని అన్నారు. గే కమ్యూనిటీ యాక్టివిస్ట్ విష్ణు మాట్లాడుతూ.. మా సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్స్‌లో హౌస్ ఫుల్ బోర్డ్స్ చూడటం సంతోషంగా ఉంది. సునీల్ కుమార్ రెడ్డి ఒక మంచి విషయాన్ని ప్రేక్షకులకు, సొసైటీకి చెప్పాలని అనుకున్న ఉద్దేశం నెరవేరిందని అనిపిస్తోంది. కాలేజ్ స్టూడెంట్స్, టీచర్స్, పలు ఆర్గనైజేషన్స్ వాళ్లు మా మూవీ చూస్తున్నారు. సినిమా చూశాక వారిలో మా లాంటి వాళ్ల పట్ల ఒక కొత్త పర్సెప్షన్ కనిపిస్తోంది. ఇలాంటి మార్పు రావాలనే దర్శకుడు ఈ సినిమాను రూపొందించారని అన్నారు.
నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో సునీల్ కుమార్ రెడ్డి ఒక చరిత్ర సృష్టించారు. గే, ట్రాన్స్‌జెండర్ సమస్యలు చెబుతూ వచ్చిన ఫస్ట్ సినిమా ఇదే. ఆ తర్వాత ఇలాంటివి ఎన్ని చిత్రాలు వచ్చినా దీని తర్వాతే ఉంటాయి. ‘శంకరాభరణం’ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. ఈ అర్ధనారీశ్వర సినిమా మరో చరిత్ర సృష్టించబోతోంది. ఈ సినిమాను సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్సుల్లో చూశాను. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేందుకు వస్తున్నారు. వీళ్ల ఆర్గనైజేషన్స్, మీడియా, సివిల్ సొసైటీలు, అన్నీ కలసి ఈ సినిమాకు పెద్ద విజయం చేకూర్చాయి. ఇందుకు సునీల్ కుమార్ రెడ్డిని అభినందిస్తున్నాను. నా కెరీర్‌లో ‘అమ్మో ఒకటో తారీఖు’ ఎలా గుర్తుండిపోతుందో.. ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుందని తెలిపారు.
చిత్ర దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మా ‘ఎల్‌జిబీటీ ఏ లీగల్ బ్యాటిల్’ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఎన్నో ఆర్గనైజేషన్స్, మీడియా మిత్రులు, ఛారిటీ సంస్థలు మా మూవీని ప్రశంసిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రూపొందించడం వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ట్రాన్స్‌జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చెప్పేందుకే ఈ సినిమాను రూపొందించాను. సినిమా ప్రదర్శితమవుతోన్న అన్ని థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మా మూవీని మరింతగా ఆదరించాలని, ఈ సినిమాతో సొసైటీలో ఒక మంచి మార్పునకు అడుగుపడాలని కోరుకుంటూ.. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు ఆనంద చక్రపాణి, నటుడు వంశీకృష్ణ, ట్రాన్స్‌జెండర్ ఇన్ స్టాగ్రామ్ యాక్టివిస్ట్ హీరోయిన్ హిమ రాథోడ్ వంటి వారంతా మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ పట్ల తమ ఆనందాన్ని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!
ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక
మాట నిలబెట్టుకున్న థమన్.. ఎంత గొప్ప మనసో!