పోసాని భార్యను బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా
ABN , Publish Date - Jul 15 , 2026 | 03:05 PM
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కలం నుంచి జాలువారిన డైలాగ్స్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి. అయితే ఏ ఒక్కరూ కూడా ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే స్టార్స్ అయిపోలేదు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కలం నుంచి జాలువారిన డైలాగ్స్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి. అయితే ఏ ఒక్కరూ కూడా ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే స్టార్స్ అయిపోలేదు. ఇప్పుడు వారు అనుభవిస్తున్న ఈ స్టార్ డమ్ రావడానికి వారు ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చారు. ఇక త్రివిక్రమ్ కూడా ఒకప్పుడు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డాడనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆయన పడ్డ ఆర్థిక ఇబ్బందులను, రూమ్ మేట్స్‌గా ఉన్న రోజులను నటుడు సునీల్ పలు సందర్భాల్లో పంచుకున్నారు. అయితే, అంతకంటే ముందు అసిస్టెంట్ రైటర్‌గా అవకాశం కోసం త్రివిక్రమ్ పడ్డ తపనను, ఆ సమయంలో ఎదుర్కొన్న ఒక హృదయపూర్వక సంఘటనను సీనియర్ రైటర్, నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్రివిక్రమ్ మద్రాస్ వెళ్ళడానికి డబ్బులు లేకపోతే కమెడియన్ గౌతం రాజు తన చేతి బ్రేస్‌లెట్‌ను తాకట్టు పెట్టి మరీ సహాయం చేశాడని పోసాని గుర్తుచేసుకున్నాడు.
పోసాని కృష్ణమురళి రైటర్‌గా బిజీగా ఉన్న రోజుల్లో, త్రివిక్రమ్ అవకాశం కోసం నిత్యం ఆయన ఇంటి చుట్టూ తిరిగేవాడట. పోసాని ఉదయమే పనిపై వెళ్ళిపోతుండటంతో, త్రివిక్రమ్ ఆయన భార్యను కలిసి.. తన పేరు ఆకెళ్ళ శ్రీనివాస్ అని, పోసానికి పెద్ద ఫ్యాన్ అని చెబుతూ అసిస్టెంట్ రైటర్‌గా అవకాశం ఇప్పించమని కోరేవాడని, తన భార్య ఆ అబ్బాయి రోజు వస్తున్నాడు. అతనికి ఎస్ ఆర్ నో అని అయినా చెప్పండి అని చెప్పేది. ఆ తర్వాత ఒకరోజు కమెడియన్ గౌతం రాజు, త్రివిక్రమ్ గురించి తనకు చెప్పాడని, త్రివిక్రమ్ చాలా మంచివాడని, అయితే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాడని ఆయన చెప్పడంతో.. తనను మద్రాసులో కలవమని, అక్కడే పది పదిహేను రోజులు ఉంటానని చెప్పినట్లు పోసాని తెలిపాడు.
అయితే, మద్రాసు వెళ్ళడానికి కూడా త్రివిక్రమ్ వద్ద కనీసం డబ్బులు లేవని తెలుసుకున్న గౌతం రాజు ఎంతో ఉదారంగా స్పందించినట్లు పోసాని గుర్తుచేశాడు. వెంటనే తన చేతికున్న బంగారు బ్రేస్‌లెట్‌ను తీసి ఒక మార్వాడీ కొట్టులో వెయ్యి రూపాయలకు తాకట్టు పెట్టి ఆ డబ్బులను త్రివిక్రమ్‌కు అందించి ఆయనను మద్రాసు పంపించాడని పోసాని వివరించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరిన త్రివిక్రమ్ వెనుక.. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఎన్నో కష్టాలు, గౌతం రాజు లాంటి స్నేహితుల అండ ఉన్నాయనే విషయాన్ని పోసాని తెలిపాడు. ఆ కృతజ్ఞతతోనే త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఒక చిన్న పాత్రలో అయినా గౌతం రాజు కనిపిస్తాడు అని కొందరు చెప్పుకొస్తున్నారు.