NTR: ఎన్టీఆర్ హక్కుల పరిరక్షణపై హైకోర్టు తీర్పు!
ABN, Publish Date - Jan 29 , 2026 | 01:38 PM
జూనియర్ ఎన్టీఆర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పేరును, ఆయన బిరుదులను ఉపయోగించి వాణిజ్య ప్రయోజనాలు పొందాలని చూసినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఇక మీదట చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపింది.
ఇటీవల కాలంలో సినిమా ప్రముఖులను రకరకాలుగా ట్రోలింగ్ చేయడం ఎక్కువైపోయింది. ఎ.ఐ. వినియోగంలోకి వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని, నటీనటుల ఫోటోలను ఉపయోగించి, వారి గొంతును అనుకరిస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు... వారిని అగౌరపరిచే విధంగానూ వీడియోలు, రీల్స్ రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వ్యక్తిత్వ హననాన్ని తట్టుకోలేక కొందరు ఇప్పటికే కోర్టుకు వెళ్ళి తమ హక్కులను కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఢిల్లీ హైకోర్టులో వారికి అనుకూలంగా ఉత్తర్వులు సైతం వచ్చాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణ నిమిత్తమై ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. ఆయనకు అనుకూలంగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, నందమూరి తారక రామారావు, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ వంటి పేరు, బిరుదులను ఎన్టీఆర్ అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది. వీటిని అనధికారంగా వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కును ఎన్టీఆర్ కు ఇచ్చింది. వాటిని ఉల్లంఘించే వారిపై కాపీరైట్ యాక్ట్, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ను ఉపయోగించవచ్చని తెలిపింది. ఇప్పటికే ఎవరైనా అతని వ్యక్తిత్వానికి భంగం కలిగే పోస్టులు పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి లేదా ఎ.ఐ. ద్వారా క్రియేట్ చేసి వాణిజ్య లాభాల కోసం వాడటాన్ని ఉపేక్షించబోమని తెలిపింది. మరి హైకోర్టు ఉత్తర్వుల తర్వాత అయినా ఎన్టీఆర్ ను ట్రోల్ చేసే వారి సంఖ్య తగ్గుతుందేమో చూడాలి.