దసరా రేసులో తెలుగు సినిమాల జోరు.. ‘జైలర్ 2’ పరిస్థితి ఏంటి?
ABN, Publish Date - Aug 31 , 2026 | 12:20 PM
సినిమా విడుదలకు పండుగ సీజన్ (Dasara season movies) అంటే నిర్మాతలకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వరుస సెలవులు, ప్రేక్షకులకు అందుబాటులో ఉండే సమయం కారణంగా ఈ సమయంలో సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
సినిమా విడుదలకు పండుగ సీజన్ (Dasara season movies) అంటే నిర్మాతలకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వరుస సెలవులు, ప్రేక్షకులకు అందుబాటులో ఉండే సమయం కారణంగా ఈ సమయంలో సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సంక్రాంతి, దసరా, వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్లను ముందుగానే ఖరారు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం దసరా సీజన్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంటోంది.
ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల లెక్క పెరగడంతో భాషలతో సంబంధం లేకుండా సినిమాలు ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా విడుదలవుతున్నాయి. దీంతో ఒకే సమయంలో పలు భారీ చిత్రాలు థియేటర్లలోకి వస్తే స్క్రీన్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి దసరా సీజన్‌లో కనిపించేలా ఉంది. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ను (Jailer 2) అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ డేట్‌పై మేకర్స్ భారీ అంచనాలతో ఉన్నారు. అయితే ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాలు కూడా దసరా సెలవులను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్లను ఖరారు చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో ‘జైలర్ 2’కు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల విషయంలో పోటీ తప్పదనే చర్చ మొదలైంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా.. అక్టోబర్ 9కు మార్చారు. అదే సమయంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబా లి’ విషయంలోనూ రిలీజ్ డేట్‌పై మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత సెప్టెంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, ఆ తేదీని ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ‘ఎపిక్’ కోసం కేటాయించే ప్రయత్నాలు జరిగాయి. దీంతో ‘రణబాలి’ని అక్టోబర్ 16న విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించింది. దసరా సీజన్‌లో పలు భారీ తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుండటంతో స్క్రీన్స్ కేటాయింపుపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ‘జైలర్ 2’ అక్టోబర్ 15న వస్తుండగా.. అక్టోబర్ 16న మరో తెలుగు భారీ చిత్రం విడుదలైతే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంపిణీ విషయంలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ మార్చే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. రజినీకాంత్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మార్కెట్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ‘జైలర్’ తెలుగు వెర్షన్ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. రజినీకాంత్‌కు ఉన్న స్టార్ ఇమేజ్, ఆయన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవల తమిళ సినిమాలు కూడా తెలుగు మార్కెట్‌లో మంచి వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ చిత్రాలపై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. దీంతో ‘జైలర్ 2’కు సరైన థియేటర్లు లభిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. దసరా రేసులో తెలుగు సినిమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ‘జైలర్ 2’కు స్క్రీన్ల కేటాయింపు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. పోటీని ఎదుర్కొంటూ రజినీకాంత్ సినిమా అదే తేదీన వస్తుందా? లేక విడుదల తేదీని మార్చుకుంటుందా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది.