Nakshatra: సినిమాల్లో నటిస్తూనే చదువులోనూ టాప్.. నక్షత్ర లక్ష్యం ఇదే!
ABN, Publish Date - Aug 30 , 2026 | 10:03 AM
తెలుగులో ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘ఇరుముడి’(IrumudI) చిత్రంలో ‘మణికంఠ’ పాత్రలో ఒదిగిపోయి.. తన అద్భుత నటనతో పేక్షకులను అలరించింది బేబీ నక్షత్ర (Nakshatra).
తెలుగులో ఇటీవల విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ‘ఇరుముడి’(IrumudI) చిత్రంలో ‘మణికంఠ’ పాత్రలో ఒదిగిపోయి.. తన అద్భుత నటనతో పేక్షకులను అలరించింది బేబీ నక్షత్ర (Nakshatra). చిన్న వయసులోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నారి ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇరుముడి’ సినిమాలో నటించిన అనుభవం, రవితేజ, ప్రియాభవానీ శంకర్‌తో కలిసి నటించడం చాలా బాగుంది. డైరెక్టర్ సహా సెట్‌లో అందరూ నన్ను బాగా చూసుకున్నారు అని తెలిపింది.
నటనలో కానీ, డ్యాన్స్‌లో కానీ ఏమైనా ప్రత్యేక శిక్షణ తీసుకున్నావా?
లేదు, ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నాకు డ్యాన్స్ వచ్చు... కానీ ప్రొఫెషనల్‌గా ఎక్కడా నేర్చుకోలేదు. నటన నాకేం కష్టంగా అనిపించదు. నాకిది చాలా సహజంగా అనిపిస్తుంది. నటించడం నాకు ఇష్టం కాబట్టి సులభంగానే చేసేస్తాను. డైరెక్టర్ ఏడవమంటే వెంటనే ఏడ్చేయగలను కూడా.
ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావ్? మీ ఊరేది?
నేనిప్పుడు ఏడో తరగతి చదువుతున్నాను. మా ఊరు కేరళలోని కణ్ణూర్ (కణ్ణనూర్). కడంబూర్ హై సెకండరీ స్కూల్‌లో చదువుతున్నాను.
సినిమాల్లో తొలి అవకాశం ఎలా వచ్చింది?
తెలుగులో ‘ఇరుముడి’ నా మొదటి సినిమా. మొత్తంగా చూసుకుంటే ఆరో సినిమా. ఇదివరకు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించాను. నా మొదటి సినిమా తమిళంలో ‘పెటారాప్’. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చేసిన రీల్స్, వీడియోలు చూసి ఆ సినిమా డైరెక్టర్ నన్ను సంప్రదించారు. ‘ఇరుముడి’ సినిమా దర్శకుడు శివ నిర్వాణ కూడా నన్ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే సంప్రదించారు.
బడిలో నువ్వు అల్లరి పిల్లవా?
నేను గుడ్ గర్ల్‌నే. షూటింగ్స్‌కు వెళ్లినా చదువును అస్సలు నిర్లక్ష్యం చేయను. చదువుకు రోజూ కొంత సమయం కేటాయిస్తాను. చదువంటే నాకు చాలా ఇష్టం.పెద్దయ్యాక పైలట్.. లేదా ఆర్మీలో చేరాలని ఉంది. రెండూ నాకు చాలా ఇష్టం.
నీకు ఇష్టమైన నటులు ఎవరు?
తెలుగులో రవితేజ సార్ అంటే చాలా ఇష్టం. మలయాళంలో మోహన్‌లాల్ సార్, మంజు వారియర్ మేడం అంటే ఇష్టం. మంజువారియర్‌లా నటించాలని నాకు ఆశ.
షూటింగ్ గ్యాప్‌లో ఏం చేస్తావు?
ఖాళీ సమయంలో సెట్‌లో ఉన్న అమ్మ, మామ, అక్కలతో ఆడుకుంటాను. రవితేజ సార్, డైరెక్టర్ సార్ నాకు చాలా చాక్లెట్లు ఇచ్చేవారు. హైదరాబాద్ నాకు ఎంతో నచ్చింది. ఇక్కడి ప్రజలు, తెలుగు సినిమా సెట్స్ చాలా బాగుంటాయి. వాళ్లందరి ప్రేమ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతానికైతే ఏ సినిమా అంగీకరించలేదు. షూటింగ్ పూర్తి చేసిన ‘డాడ్’ అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
అమ్మానాన్నలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం?
ఇద్దరూ ఇష్టమే. అమ్మంటే కొంచెం ఎక్కువ ఇష్టం.