The Bluff: నిన్న రాజమౌళి... నేడు మహేశ్...
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:28 PM
ప్రియాంక చోప్రా నటించిన తాజా చిత్రం 'ది బ్లఫ్' మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ చిత్ర బృందంపై మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన 'ది బ్లఫ్' మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దానిని చూడగానే ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి (Rajamouli) ... ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా ఈ ట్రైలర్ ను చూసిన ప్రిన్స్ మహేశ్ బాబు సైతం తన హర్షాన్ని వ్యక్తం చేశాడు.
'ది బ్లఫ్' (The Bluff) మూవీ ట్రైలర్ ను జత చేస్తూ మహేశ్ బాబు (Maheshbabu) సోషల్ మీడియాలో 'ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా రాజీపడని, ధృడమైన నటనను ప్రదర్శించారు' అంటూ 'ది బ్లఫ్ మూవీ టీమ్ కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' మూవీలో మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' తరహాలోనే ప్రియాంక 'వారణాసి' (Varanasi) లోనూ యాక్షన్ హీరోయిన్ గా నటిస్తోంది. చీరకట్టి తుపాకీ పట్టుకున్న ఆమె పోస్టర్ ను చూస్తే ఆ విషయం అర్థమౌతుంది. అయితే ఇప్పటికే హాలీవుడ్ సినిమాలలోనూ, వెబ్ సీరిస్ లోనూ ప్రియాంక తన యాక్షన్ క్వీన్ గా తన సత్తాను చాటింది. అదే కోవలో ఇప్పుడు 'ది బ్లఫ్' మూవీలోనూ మరోసారి యాక్షన్ సీన్స్ లో తన ప్రతిభను చాటబోతోంది. 1800 నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఎర్సెల్ బోడెన్ అనే మాజీ సముద్రపు దొంగ పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతోంది. తన వారసుల్ని కాపాడుకోవడానికి ఆమె ఎలాంటి పోరాటం చేసిందనేది ఈ చిత్ర కథ. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.