Bombay Stories: 'బాంబే స్టోరీస్' ఓటీటీ మూవీ.. విశ్లేష‌ణ‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 07:05 AM

బాంబే స్టోరీస్ అన్నారు కానీ నిజానికి ఇవి సాదత్ హసన్ మంటో స్టోరీస్. మంటో అనగానే ఎవరికైనా దేశ విభజన కథలే గుర్తొస్తాయి.

Bombay Stories Telugu Analysis

బాంబే స్టోరీస్ (హిందీ)

నటీనటులు: రహత్ షా కాజ్మీ, అనుప్రియ గోయెంకా, మౌనీరాయ్

దర్శకుడు: రహత్ షా కాజ్మీ

నిడివి: 131 నిమిషాలు

విడుదల: జియో హాట్ స్టార్

బాంబే స్టోరీస్ (Bombay Stories) అన్నారు కానీ నిజానికి ఇవి సాదత్ హసన్ మంటో స్టోరీస్ (Saadat Hasan Manto’s literary works). మంటో అనగానే ఎవరికైనా దేశ విభజన కథలే గుర్తొస్తాయి. టోబా టేక్ సింగ్, భోల్ దో, ఠండా ఘోష్ కథలు విభజన సృష్టించిన హింసను, మానవత్వ పతనాన్ని లోతైన తీవ్రతతో చెపుతాయి. మంటోను కేవలం దేశ విభజన రచయితగా పరిమితం చేయడం కుదించడమే. విభజనపూర్వ బొంబాయిలో మంటో చూసిన ప్రపంచంలో మరో రకమైన హింస ఉంది. మతం పేరుతో మనుషులను చంపడం కంటే, డబ్బు పేరుతో మనుషులను ప్రతీరోజూ కొంచెం కొంచెంగా చంపే వ్యవస్థ అక్కడి నిత్య దృశ్యం. రక్తపాతం కనిపించకపోవచ్చు. కానీ ఆత్మగౌరవం ప్రతీరోజూ గాయపడుతూనే ఉంటుంది.

మంటో బొంబాయి కథల్లో లైంగిక కార్మికులు, దళారులు, సినిమా ప్రపంచంలోని చిన్న ఉద్యోగులు, నేరస్థులు, వలసజీవులు, నిరాశ్రయులు తరచూ కనిపిస్తారు. 1930ల బొంబాయి నగరంలోని సామాజిక వైవిధ్యాన్ని. అట్టడుగు జీవితాలను ఆయన కథలు నమోదు చేశాయి. అటువంటి కథల్లోంచి ఖుషియా, హతక్, బూ అనే ఓ మూడింటిని కలిపి ఒక సినిమా చేస్తే అదే బాంబే స్టోరీస్. మూడు వేర్వేరు కథలే అయినా వాటిని సినిమాగా అల్లిన విధానంలో ఎక్కడా వేర్వేరుగా అనిపించవు. మూడు కథలకు చిన్న చిన్న లింకులిచ్చి ఒకే కథగా మార్చడంలో దర్శకుడు రహత్ షా కాజ్మీ (Rahhat Shah Kazmi) విజయం సాధించాడు. నిజానికి ఈ కథ లను ఒక ఆంథాలజీ చేయాలి. కానీ దర్శకుడు తెలివిగా సినిమాగా మార్చుకున్నాడు.

మంటో కథల్లో మనిషి మంచివాడా, చెడ్డవాడా అన్నది ప్రధానం కాదు. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? అతనిలోని క్రూరత్వానికి వెనుక ఎంత నిస్సహాయత ఉంది? అతని ప్రేమలో ఎంత స్వార్థం ఉంది? అతని స్వార్థంలో ఎంత ప్రేమ మిగిలి ఉంది? అన్నదే ముఖ్యం. ఆ సంక్లిష్టమైన మానవ స్వభావాన్ని తెరమీదికి తీసుకు రావడానికి దర్శకుడు రహత్ షా కాజ్మీ ప్రయత్నించాడు. 'ఖుషియా' దెబ్బతిన్న పురుష అహంకారం. 'హతక్' అవమానం నుంచి ఆత్మగౌరవానికి నడక. 'బూ' కాంక్షా వాసన, ఈ మూడు కథ ల్లోనూ లైంగికత, ఆత్మగౌరవం, మానవ సంబంధాల్లోని అస్పష్టత ప్రధానాంశాలు. అయితే మంటో వాటిని మూడు విభిన్నమైన మనస్తత్వాల ద్వారా ప్రకటించాడు. మంటో చూపిన దారిలో దర్శకుడు ఎక్కడా తడబడ లేదు. ఖుషియా పాత్రను స్వయంగా దర్శకుడే పోషించాడు.

bombay.jpg

'ఖుషియా' కథలో స్త్రీ పురుషుడిని ఎలా చూస్తుందన్నది సమస్య. 'హతక్' కథలో పురుషుడు స్త్రీని ఎలా చూస్తాడన్నది సమస్య. 'బూ' కథలో పురుషుడు స్త్రీని ఎలా అనుభవిస్తాడన్నది సమస్య. మొదటి కథలో పురుషుడి అహంకారం గాయపడుతుంది. రెండో కథలో స్త్రీ ఆత్మగౌరవం గాయ పడుతుంది. మూడో కథలో ఒక శారీరక అనుభవం జ్ఞాపకంగా మారి పురుషుడిని వెంటాడుతుంది. అంటే చూపు, అవమానం, వాసన అనే మూడు అనుభవాల ద్వారా సినిమా మానవ సంబంధాల్లోని మూడు విభిన్నమైన సంక్లిష్టతలను ఆవిష్కరిస్తుంది. ఒక కథలో పురుషుడు తనను పురుషుడిగా గుర్తించమంటాడు. మరో కథలో స్త్రీ తనను మనిషిగా గుర్తించమంటుంది. మూడో కథలో పురుషుడు ఒక స్త్రీని మరచిపోయినా, ఆమె దేహస్మృతిని మరచిపోలేడు.

ఒక దర్శకుడు వేర్వేరు కథలను ఒకే సినిమాగా మలచడంలో రెండు ప్రమాదాలుం టాయి. కథల స్వతంత్ర అస్తిత్వం దెబ్బతినడం ఒకటి. వాటిని కలిపే ప్రయత్నంలో కథనం కృత్రిమంగా తయారవడం రెండోది. మంటో విషయంలో ఈ సమస్య మరింత క్లిష్టం. ఎందుకంటే ఆయన కథలకు సంఘటనలకంటే మనస్తత్వాలే ముఖ్యం. కథ ఎక్కడ మొదలవు తుందో చెప్పగలం. కానీ ఒక పాత్రలోని నైతిక సంఘర్షణ ఎక్కడ మొదలైందో చెప్పలేం. ఇలాంటి పాత్రలను తెరమీద చూపించేప్పుడు దర్శకుడికి బోలెడంత సంయమనం కావాలి. స్త్రీ శరీరాన్ని దృశ్య ఆకర్షణగా మార్చడం సులభం. ఆ శరీరంలో నివసిస్తున్న వ్యక్తి అవమానాన్ని, కోరికను, ఆత్మగౌరవాన్ని ప్రేక్షకుడికి అనుభవమయ్యేలా చేయడం కష్టం.

అనుప్రియా గోయెంకా (Anupriya Goenka), మౌనీరాయ్ (Mouni Roy) తమ పాత్రలను ఆకర్షణ, లైంగికత, తీవ్రమైన అంతర్గత నిస్సహాయత కలగలిపి మంటో ఆలో చనకు రూపం ఇచ్చారు. ఒక స్పర్శ ఆప్యాయత కావచ్చు. అదే స్పర్శ వ్యాపార ఒప్పందం కూడా కావచ్చు. ఒక చిరునవ్వు ఆహ్వానం కావచ్చు. అదే చిరునవ్వు బతకడానికి నేర్చుకున్న వృత్తి పరమైన భాష కావచ్చు. శరీరం మీద హక్కు సంపాదించినంత మాత్రాన మనిషి అంతరంగంలోకి ప్రవేశించలేం. 'హతక్' కథలో సుగంధి అనుభవించే అవమానం కేవలం ఒక వ్యక్తి తిరస్కారం కాదు. తన శరీరాన్ని కొనుగోలు చేసే హక్కు ఉన్న సమాజం, తన వ్యక్తిత్వాన్ని తిరస్కరించే అధికారాన్ని కూడా తన చేతుల్లో ఉంచుకోవడంలోని క్రూరత్వం..

దర్శకుడు కాజ్మీ ఈ చిత్రంలో అట్టడుగు జీవితాలను దూరం నుంచి పరిశీలించడం కాకుండా... వారి బాధను, గౌరవాన్ని, నిశ్శబ్దాన్ని ప్రేక్షకులకు ఒక అనుభవంగా అందించాడు. మంటోను సినిమాగా మలచడమంటే ఆయన కథల్లోని సంఘటనలను చిత్రీకరించడం మాత్రమే కాదు. ఆయన కథనంలోని నైతిక అస్పష్టతను కాపాడటం. ఒక పాత్రను ప్రేక్షకుడు ప్రేమించాలా, ద్వేషించాలా అన్న నిర్ణయాన్ని దర్శకుడు ముందుగానే తీసుకోకూ డదు. ఆ సందిగ్ధంలోనే ప్రేక్షకుడిని ఉంచగల గాలి. మంటో కథల్లోని లైంగికతను కేవలం శృంగార దృశ్యాలుగా చూపిస్తే... ఆయన సాహిత్యంలోని రాజకీయ, సామాజిక విమర్శ కనిపించకుండా పోతుంది. మంటో కథల్లో నైతికత పాత్రల ప్రవర్తనలో ఉండదు. వాటిని పరిశీలిస్తున్న మన చూపులో ఉంటుంది. మంటో కథల్లోని ఈ సున్నితమైన లోతును దర్శకుడు రవ్వంత కూడా అదుపు తప్పనివ్వకపోవడమే ఈ సినిమా సౌందర్య రహస్యం. - ప్ర‌సేన్‌, 70133 58154

Updated Date - Oct 18 , 2026 | 07:36 AM