మెగావర్స్లోకి.. మరో ఇద్దరు స్టార్ హీరోలు
ABN, Publish Date - Nov 19 , 2026 | 01:20 PM
మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా రాబోతున్న మెగావర్స్ షోలో మరో ఇద్దరు స్టార్ హీరోలు పాల్గొనబోతున్నారంటూ టాలీవుడ్లో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఈ ముగ్గురు సెల్ఫ్ మేడ్ స్టార్స్‌ను ఒకే వేదికపై చూడటం అభిమానులకు పండగే!
టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏం చేసినా అదొక సెన్సేషన్. వెండితెరపై దశాబ్దాల పాటు తన నటనతో, డ్యాన్స్‌తో, మేనరిజమ్స్‌తో కోట్లాది మంది అభిమానులను అలరించిన చిరంజీవి.. ఇప్పుడు తన కెరీర్లోనే ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా మారి, మెగావర్స్ (Mega Verse Show) అనే ప్రతిష్టాత్మక సెలబ్రిటీ టాక్ షో (Celebrity Talk Show) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ షోపై రోజురోజుకూ అంచనాలు రెట్టింపవుతున్నాయి.
సాధారణంగా ఓటీటీ టాక్ షోలు అనగానే మనకు కొన్ని పాపులర్ షోలు గుర్తొస్తాయి. కానీ, స్వయంగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా మారడంతో 'మెగావర్స్' స్థాయి పూర్తిగా మారిపోయింది. ఇండస్ట్రీలో అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే చిరు.. టాలీవుడ్ అగ్ర తారలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్.. అలాగే అక్కినేని ఫ్యామిలీ, కమల్ హాసన్, సూర్య వంటి స్టార్ గెస్ట్‌లు కూడా మెగాస్టార్‌తో కలిసి ముచ్చటించబోతున్నారన్న వార్త సినీ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
అయితే, ఇప్పుడు ఈ మెగా లిస్ట్‌లో మరో ఇద్దరు క్రేజీ స్టార్ హీరోలు చేరినట్లు టాలీవుడ్ వర్గాల నుండి బలమైన సమాచారం అందుతోంది. వారెవరో కాదు.. ఒకరు మాస్ మహారాజా రవితేజ కాగా, మరొకరు నేచురల్ స్టార్ నాని. తాజా సమాచారం ప్రకారం.. రవితేజ, నాని కలిసి మెగావర్స్ షోలో ప్రత్యేక అతిథులుగా పాల్గొనబోతున్నారట. నవంబర్ చివరి వారంలో చిరంజీవితో వీరిద్దరి స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ జరగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులైన రవితేజ (Ravi Teja), నాని (Nani) ఒకే ఫ్రేమ్‌లో చిరు ఎదురుగా కూర్చుని ముచ్చటిస్తే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, స్వయంకృషితో అగ్రస్థానానికి ఎదిగిన రియల్ సెల్ఫ్ మేడ్ స్టార్ చిరంజీవి. ఆ తర్వాత ఆ స్థాయిలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి, నేడు స్టార్ హీరోలుగా ఎదిగిన సెల్ఫ్ మేడ్ స్టార్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా రవితేజ, నాని అని చెప్పాలి. వీరిద్దరికీ టాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు సెల్ఫ్ మేడ్ స్టార్స్ ఒకే వేదికపై కనిపించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రవితేజకు చిరంజీవి అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ, మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోగా.. వీరిద్దరి కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
మరోవైపు, నేచురల్ స్టార్ నాని కూడా మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో ఎదిగిన వ్యక్తే. చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగిన నాని, తన అభిమాన హీరో ఎదురుగా కూర్చుని తన జర్నీని, తన అభిమానాన్ని పంచుకోవడం అంటే అది నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనే చెప్పాలి. బాస్‌తో రవితేజ మాస్ ఎనర్జీ, నాని నేచురల్ టైమింగ్ తోడైతే నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు యంగ్ స్టార్ హీరోలు, మరోవైపు దిగ్గజ నటీనటులతో టాలీవుడ్ మొత్తాన్ని మెగావర్స్లోకి తీసుకొస్తున్న చిరంజీవి, ఓటీటీ టాక్ షోల చరిత్రలో ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ముందు ముందు మెగాస్టార్ ఇంకెంత మంది స్టార్స్‌ని ఈ షోలోకి తీసుకువస్తారో చూడాలి.