Chiranjeevi: దుర్మార్గుడా.. ఇక నా ఇంటి తలుపులు తెరిచి ఉండవు!
ABN, Publish Date - Nov 19 , 2026 | 02:13 PM
చిరంజీవితో సినిమా చేయాలని ఏ దర్శకుడికైనా కలలు ఉంటాయి. ఆ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ చిరంజీవి మాత్రం ఓ దర్శకుడితో సినిమా చేయాలని తానే స్వయంగా అడిగారట
చిరంజీవితో సినిమా చేయాలని ఏ దర్శకుడికైనా కలలు ఉంటాయి. ఆ అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ చిరంజీవి మాత్రం ఓ దర్శకుడితో సినిమా చేయాలని తానే స్వయంగా అడిగారట. ఆ దర్శకుడు మరెవరో కాదు.. వెంకీ కుడుముల. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల.. ఇప్పుడు నిర్మాతగా మారి ‘ఇట్లు అర్జున’ చిత్రాన్ని నిర్మించారు. గతంలో చిరంజీవి, వెంకీ కుడుముల కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపించాయి. దాదాపు ప్రాజెక్ట్ ఖరారైనట్లే కనిపించినా, అనుకున్న విధంగా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ విషయంపై చిరంజీవి స్పందించారు. తన కెరీర్లో ఏ దర్శకుడినీ పిలిచి సినిమా చేద్దామని అడగలేదని, కానీ వెంకీ కుడుములను మాత్రం అడిగానని చిరు గుర్తుచేసుకున్నారు. అయితే ఈ దుర్మార్గుడు కథ చెబుతానంటూ కాలయాపన చేశాడని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు తన ఇంటి తలుపులు తెరిచి లేవని చిరు అన్నారు. దీనికి వెంకీ కుడుముల స్పందిస్తూ.. గోడ దూకి వచ్చి కథ చెబుతానని సమాధానమిచ్చారు.
గతంలో చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేసిన వెంకీ కుడుములకు, ద్వితీయార్థంపై పూర్తి సంతృప్తి కలగలేదట. మెగాస్టార్ స్థాయికి తగ్గ కథతోనే ఆయన ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టినట్లు గతంలో వెల్లడించారు. అంటే చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉన్నప్పటికీ, కథ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని వెంకీ భావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్ట్‌పై మరోసారి ఆసక్తిని పెంచుతున్నాయి. మెగాస్టార్ సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో, ఆయనను మెప్పించే కథను సిద్ధం చేయాల్సిన బాధ్యత వెంకీ కుడుములపైనే ఉంది. మరి ఈసారి పక్కా స్క్రిప్ట్‌తో చిరంజీవి ముందుకు వెళ్తారా? గతంలో ఆగిపోయిన ఈ క్రేజీ కాంబినేషన్‌ను పట్టాలెక్కిస్తారా? అన్నది చూడాలి.