నా ఆత్మీయ మిత్రుడు ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: చిరంజీవి
ABN, Publish Date - Aug 27 , 2026 | 07:58 PM
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ సినీ నటుడు జీవీ నారాయణరావు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడిగా, అభిరుచి గల నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ సినీ నటుడు జీవీ నారాయణరావు (GV Narayana Rao) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన చిరకాల ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ జీవీ నారాయణరావుతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దిగ్గజ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన ‘అంతులేని కథ’ (1976) చిత్రంతో వెండితెరకు పరిచయమైన జీవీ నారాయణరావు, ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టెలివిజన్ సీరియళ్లలోనూ తన వైవిధ్యమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు’, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘యముడికి మొగుడు’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించి ఘన విజయాలను అందుకున్నారు. ఇంకా చిరంజీవి నటించిన ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి అనేక సినిమాల్లో ఆయన భాగమయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. ‘‘ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనతో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. నాతో ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా మా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అంటూ నివాళులర్పించారు. జీవీ నారాయణరావు మృతి పట్ల టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సైతం తీవ్ర సంతాపం తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
‘హనుమాన్ అంశ్’.. బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రం సంచలనం
తుది దశకు చేరుకున్న విశ్వక్ సేన్ ‘లెగసీ’.. టార్గెట్ డిసెంబర్
డైరెక్టర్ పవన్ సాధినేని కేసులో ట్విస్ట్.. పలువురు మహిళలతో!