మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ.. బన్నీ పోస్ట్ వైరల్
ABN, Publish Date - Aug 22 , 2026 | 12:25 PM
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలతో వర్ధిల్లాలని పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు, అగ్ర సినీ దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక విషెస్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రముఖులు పెడుతున్న స్పెషల్ పోస్టులు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండగా, అభిమానుల సందడితో సోషల్ మీడియా అంతా మెగా నామస్మరణతో మారుమోగిపోతోంది.
ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్‌గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అన్నయ్య నాకు తెరపై హీరో కాకముందు నుంచే నిజ జీవితంలో ఎప్పటికీ నా ఏకైక హీరో. చిన్నతనంలో ఆయన కాలేజీ నుంచి వేసవి సెలవులకు ఇంటికి వస్తే పండగలా ఉండేది, బుల్లెట్ బైక్‌పై ఆయన వెళ్తుంటే పక్కన నడవడమే నాకు ఎంతో గర్వంగా అనిపించేది. మద్రాస్‌లో ఉన్నప్పుడు రోజుకు 18 గంటల పాటు చెమటోడ్చి, ఒళ్లంతా గాయాలైనా లెక్కచేయకుండా ఆయన పడ్డ కష్టాన్ని నేరుగా చూశాను. నా చదువుల్లో వైఫల్యాలను ఏనాడూ ఎత్తిచూపకుండా నాపై ఎనలేని ప్రేమ, వాత్సల్యం చూపించారు. అటు దక్షిణాది-ఉత్తరాది చిత్రసీమలను కలిపే సాంస్కృతిక వారధిగా నిలవడమే కాకుండా.. సూపర్ స్టార్‌డమ్ నుంచి పద్మవిభూషణ్, కేంద్ర మంత్రి పదవుల వరకు ఎన్నో శిఖరాలను అధిరోహించినా ఆయన ఏనాడూ విశ్రమించలేదు. ఇటీవలే స్పైన్ సర్జరీ జరిగినా అంతే వేగంగా కోలుకుని మళ్లీ సెట్స్‌పైకి వచ్చారు. అన్నయ్యకు శుభాకాంక్షలు చెప్పడం కేవలం ఒక లాంఛనం మాత్రమే కాదు, ఆయన జీవితం నాలాంటి కోట్లాది మందిని ఎలా ప్రభావితం చేసిందో గుర్తుచేసుకోవడం. - ఏపీ డిప్యూటీ సీఎం, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అద్భుతమైన ప్రయాణం, తెలుగు చిత్రసీమకు మీరు అందించిన చిరస్థాయి సేవలు, సమాజ సేవ పట్ల మీకున్న నిబద్ధత ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని.. మరెన్నో సంవత్సరాల పాటు విజయవంతంగా కొనసాగుతూ సమాజ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే చిరంజీవి గారు. - ఏపీ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్
1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. -వంగవీటి రాధాకృష్ణ
‘మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మాకు ఎల్లప్పుడూ అండ (పిల్లర్ ఆఫ్ సపోర్ట్)గా నిలబడ్డారు. ఆయన మనలోని ప్రతి ఒక్కరినీ ఎంతగానో ప్రేరేపించారు, ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారు. #KKAVCF (కట్టే కాలే అంత వరకు చిరంజీవి ఫ్యాన్‌నే)’. - అల్లు అర్జున్
యవ్వనంలో చిరంజీవిలా నటించాలి అని కోరిక. ఒక వయస్సు వచ్చాక చిరంజీవి లాంటి పేరు ప్రతిష్ఠ సంపాదించాలి అని కోరిక. ఆయన పరిచయం అయ్యాక అన్నయ్యలా ఉండాలి, అందరిని మనవారిగా చూడాలని కోరిక. వరుస అపజయాలతో ఇక సినిమానే వదిలేద్దాం అనుకున్న నాతో ఆ రోజు ఆయన మాట్లాడిన మాటల తరువాత అర్ధమైంది.. చిరంజీవి ఒకడే, ఇవన్నీ సాధ్యపడేది ఆ చిరంజీవుడికొకటే. ఆ చిరంజీవిలా ఇంకొకరు లేరు.. మరొకరు రాబోరు. భూమి ఒకటే, సూర్యుడొక్కడే, అలానే ఆ చిరంజీవి ఒకడే. నాతో పాటు కొన్ని కోట్ల మందికి పునర్జన్మ ఇచ్చిన నట శిఖరం చిరంజీవి అన్నయ్యకి హ్యాపీ బర్త్‌డే. - హీరో శ్రీకాంత్
ఇంకా ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
మామ ‘కాకా’.. అల్లుడు ‘రాకా’.. సరికొత్త సెంటిమెంట్
‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!