ప్రథమ్ సంకల్ప్.. ‘రామాయణ’ మహా ప్రయాణానికి శ్రీకారం

ABN , Publish Date - Jul 19 , 2026 | 05:08 PM

ప్రపంచానికి మన భారతదేశం అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో ‘రామాయణం’ ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా.. భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది.

Ramayana Pratham Sankalp Event

ప్రపంచానికి మన భారతదేశం అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో ‘రామాయణం’ ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా.. భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ ‘రామాయణం’ తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు ‘రామాయణం’ బేస్ చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆ శాశ్వత గాథ మరో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. అదే నమిత్ మల్హోత్రా ‘రామాయణ’ (Ramayana). జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ట్రైలర్ విడుదలకు ఈ చిత్ర బృందం న్యూఢిల్లీలో శనివారం (జూలై 18) ప్రత్యేకంగా తొలి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘ప్రథమ్ సంకల్ప్’ (Pratham Sankalp) పేరుతో నిర్వహించిన ఈ వేడుక.. భారత్ నుంచి ప్రపంచానికి రామాయణ ప్రయాణానికి శ్రీకారంగా నిలిచింది.


ఈ మహా ప్రయాణానికి న్యూఢిల్లీని ప్రారంభ వేదికగా ఎంచుకోవడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. వైవిధ్యభరితమైన భారతదేశాన్ని రామాయణం విలువలు ఏకతాటిపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో, దేశ హృదయమైన రాజధానిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అధికారిక ట్రైలర్‌ను ఎంపిక చేసిన అతిథులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రయాణం న్యూఢిల్లీకే పరిమితం కాలేదు. ‘రామాయణ స్కూల్స్ ప్రోగ్రామ్’ ద్వారా దేశవ్యాప్తంగా 500కు పైగా పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులు రామాయణం బోధించే శాశ్వత విలువలను క్రియేటివ్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలుసుకునే అవకాశం పొందారు. అందులో విజేతలుగా నిలిచిన కొందరు చిన్నారులను ఈ ‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. అలాగే దేశంలోని 20 నగరాల్లోని వందలాది మంది చిన్నారులు, కంటెంట్ క్రియేటర్లు, అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానించి.. ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే ట్రైలర్‌ను ప్రత్యేకంగా వీక్షించే అవకాశాన్ని కల్పించారు.


ఈ వేదికపై ‘రామాయణ’ చిత్రంలోని ప్రధాన తారాగణం తొలిసారిగా ఒకే వేదికపై సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) పాల్గొన్నారు. భారతీయ భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూనే, ‘దంగల్’ చిత్రంతో చైనా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ఆయన, ఇప్పుడు ‘రామాయణ’ను తెరకెక్కిస్తున్నారు. ఈ వేడుకలో భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఒకే వేదికపై సందడి చేశారు. రామానంద్ సాగర్ ‘రామాయణం’లో శ్రీరాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్, ఈ చిత్రంలో దశరథ మహారాజు పాత్రలో కనిపించనున్నారు. అలాగే శోభన కైకేయి పాత్రలో, అజింక్య దేవ్ విశ్వామిత్ర మహర్షిగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ అద్భుత తారాగణానికి నాయకత్వం వహిస్తున్నది రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆయన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సాయి పల్లవి (Sai Pallavi) సీతాదేవి పాత్రలో తన హుందాతనం, కరుణ, ఆత్మస్థైర్యాన్ని తెరపై ఆవిష్కరించనుండగా, పాన్ ఇండియా స్టార్.. రాకింగ్ స్టార్ యశ్ (Yash) ఈ చిత్రానికి తన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు, మహాబలశాలి రావణుడు పాత్రను పోషిస్తున్నారు. ఈ వేడుకకు సన్నీ డియోల్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన హనుమంతుడు పాత్రలో ఆయన నటిస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమలోని అత్యుత్తమ ప్రతిభను, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులతో కలిపి ఒకే వేదికపైకి తీసుకురావాలన్న నిర్మాత నమిత్ మల్హోత్రా సంకల్పానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డి‌నెగ్ (DNEG), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలైన హాన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి 2026 సందర్భంగా ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

Updated Date - Jul 19 , 2026 | 05:10 PM