సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aniesh: అనస్వరతో కెమిస్ట్రీ అదిరిపోతుంది.. ఇట్లు అర్జున హీరో ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 12 , 2026 | 06:52 PM

ఇట్లు అర్జున సినిమాతో హీరోగా పరిచయమవుతున్న అనీశ్ తన సినీ ప్రయాణం, నటన శిక్షణ, అనస్వర రాజన్‌తో కెమిస్ట్రీ, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రోత్సాహంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Itlu Arjuna

నచ్చిన ప్రొఫెషన్‌ అయినా, నటనలో ఓనమాలు దిద్దుకుని మరీ పద్ధతిగా సినిమా రంగ ప్రవేశం చేస్తున్నాడు అనీశ్ (Aniesh). తొలి చిత్రంతో మాస్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవడానికి తహతహలాడే హీరోల మధ్య, తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉండాలని, తనను తాను ప్రూవ్‌ చేసుకోవాలని విలక్షణమైన పాత్రను, వైవిధ్యమైన కథను సెలక్ట్‌ చేసుకున్నారు. ఈ శుక్రవారం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna) అంటూ అందమైన ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న అనీశ్‌ ‘చిత్రజ్యోతి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

‘నేను హీరో కావాలని 15-16 ఏళ్లప్పటి నుంచి అనుకుంటున్నా. మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. లండన్‌లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదవడం పూర్తయ్యాక, ఇక్కడ అరుణ భిక్షు, వైజాగ్‌ సత్యానంద్‌ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. యుఎస్‌లోనూ యాక్టింగ్‌ కోర్సు చేశా. తిరిగి వచ్చాక చాలా కథలు విన్నా. అప్పుడే డైరక్టర్‌ మహేశ్‌ ఉప్పల (Mahesh Uppala) ని వెంకీ కుడుముల (Venky Kudumula) పరిచయం చేశారు. మహేశ్‌ కథ చెప్పగానే థ్రిల్లింగ్‌గా అనిపించింది. మాటలు రాని అబ్బాయి తన మనసులోని ప్రేమను ఎలా వ్యక్తం చేశాడన్న కథనం ఆసక్తిగా సాగింది.

ఎవరికైనా కెరీర్‌లో కొన్ని సినిమాలు చేశాక ఈ తరహా పాత్రలు వస్తుంటాయి. నాకు లక్‌ కలిసొచ్చి ఇంత మంచి సబ్జెక్ట్‌తో తెరంగేట్రం చేస్తున్నా. అందుకే ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నా. హావభావాలు పలికించడం నుంచి, డ్యాన్సులు, ఫైట్లు.. అంటూ అన్ని అంశాలకు సంబంధించి వర్క్‌షాప్‌లు చేశాం. అనస్వర రాజన్ (Anaswara Rajan) నటనలో నాకన్నా సీనియర్‌. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్‌ మీద చాలా బావుంటుంది. నిర్మాతగా వెంకీ కుడుముల ఇష్టంగా జర్నీ చేశారు’.

అలా మొదలైంది

‘మా నాన్న మహేశ్‌రెడ్డికి దైవ భక్తి ఎక్కువ. ఇంట్లో అందరం షిరిడీ సాయిని కొలుస్తాం. అందుకే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా మా నాన్న ‘షిరిడి సాయి’, ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాలను నిర్మించారు. అప్పటి నుంచి నేను హీరోలను అడపాదడపా చూస్తూనే ఉన్నా, ఎవరితోనూ పెద్ద సాన్నిహిత్యం లేదు. అఖిల్ (Akhil Akkineni) తో మాత్రం మంచి పరిచయం ఉంది. నా తొలి చిత్రాన్ని నాగార్జున (Nagarjuna) గారు సమర్పించడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారు. తారక్ (Jr NTR), రామ్‌చరణ్‌ (Ram Charan), ప్రోత్సహించిన తీరు నా బాధ్యతను మరింత పెంచింది. తొలి చిత్ర నటుడికి ఇండస్ట్రీ నుంచి ఇంత మంచి సపోర్ట్‌ రావడం ఆనందంగా ఉంది. తారక్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్ (Allu Arjun) ఇలా అందరి సినిమాలు చూస్తూ పెరిగాను. తప్పకుండా మంచి హీరోగా ప్రూవ్‌ చేసుకోవాలని ఉంది’.

గౌరవం పెరిగింది

‘సినిమా రూపకల్పనలో ఎంతో మంది ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఆ విషయాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు నాకు ఈ రంగం మీద మరింత గౌరవం పెరిగింది. తమన్‌లాంటి సంగీత దర్శకులతో పనిచేయడం ఉత్సాహాన్నిచ్చింది. ‘ఇట్లు అర్జున’ను మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ నా సినిమాలను చూసిన ప్రేక్షకులు మంచి భావోద్వేగాలను ఆస్వాదించాలన్నదే నా లక్ష్యం. ఆ మధ్య రెండు, మూడు కథలు విన్నానుగానీ, తదుపరి చిత్రం గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ప్రస్తుతం నా ధ్యాస మొత్తం ఈ సినిమా మీదే ఉంది. హీరో కావాలనుకున్న నా చిన్ననాటి కల నెరవేరుతుంటే ఆనందంగా ఉంది. మంచి సినిమా చూశామని ప్రేక్షకులు అంటుంటే వినే క్షణాల కోసం ఎదురుచూస్తున్నా’.

Updated Date - Nov 12 , 2026 | 06:52 PM